రాప్తాడు రూరల్: అధికార బలంతో అరాచకం సృష్టించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. కురుగుంట పొలంలోని 172–1 సర్వే నంబరులో మొత్తం 17.75 ఎకరాల భూమి ఉంది. ఇందులో లలితమ్మకు 3.50 ఎకరాలు, లక్ష్మీదేవమ్మకు 3.15 ఎకరాలు ఉండగా, మిగిలిన 11.10 ఎకరాలు మారినేని సుబ్బరాయుడు కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. అయితే మారినేని కుటుంబ సభ్యుల పత్రాల్లో 12 ఎకరాలుగా ఉండటంతో వివాదం తలెత్తింది. 2020లో రీసర్వే నిర్వహించిన సమయంలో మారినేని కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో భూ వివాదం ఉన్నట్లు గుర్తించి జాయింట్ ఎల్‌పీఎంలో ఉంచారని బాధితులు తెలిపారు. 2025 జూన్‌లో మారినేని సుబ్బరాయుడు, లక్ష్మీనారాయణ, నారాయణస్వామి పేర్లపై సబ్ డివిజన్ చేశారని, ఈ ప్రక్రియలోనే తమకు అన్యాయం జరిగిందని లక్ష్మీదేవమ్మ కుటుంబం ఆరోపిస్తోంది. తమకు 3.15 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా ఆన్‌లైన్ రికార్డుల్లో కేవలం 2.69 ఎకరాలు మాత్రమే చూపించారని, అందులో సుమారు 84 సెంట్లను తమకు తెలియకుండా తగ్గించి మారినేని కుటుంబ సభ్యుల పేర్లపై నమోదు చేశారని బాధితులు వాపోయారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, కుమారుడు రఘునాథరెడ్డికి నోటీసు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ తాను ఎక్కడా సంతకం చేయలేదని ఆయన పేర్కొన్నాడు.
కోర్టులో కేసు నడుస్తున్నా..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డుల్లో మార్పులు చేయించుకున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. స్థానిక టీడీపీ నాయకులు మారినేని లక్ష్మీనారాయణ, మారినేని నారాయణస్వామి అధికారులను ప్రభావితం చేశారని వారు చెబుతున్నారు. రికార్డుల్లో మార్పులు జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత లక్ష్మీదేవమ్మ కుటుంబ సభ్యులు పలుమార్లు రెవెన్యూ అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయారు. చేసేదిలేక న్యాయపోరాటానికి దిగారు. ఇదే సమయంలో ఈనెల 9న విచారణకు హాజరుకావాలని మారినేని కుటుంబ సభ్యులకు కోర్టు నుంచి నోటీసులు జారీ అయినట్లు బాధితులు తెలిపారు. నోటీసులు అందుకున్నప్పటికీ విచారణ పూర్తయ్యేలోపే 84 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకునేందుకు హడావుడిగా చర్యలు చేపట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత అండ చూసుకుని తమకు అన్యాయం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు.
పోలీసు బందోబస్తు.. ఉద్రిక్తత
బుధవారం సీఐ, ముగ్గురు ఎస్‌ఐలు, పెద్ద సంఖ్యలో పోలీసులు, మహిళా పోలీసులు, ప్రత్యేక బలగాలు భూమి వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బందిని లక్ష్మీదేవమ్మ, ఆమె కుమారుడు రఘునాథరెడ్డి, కోడలు హరిత, కుమార్తె రమణమ్మ అడ్డుకున్నారు. ‘60 ఏళ్లుగా మేమే ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం. కోర్టులో వివాదం ఉంది. తీర్పు వచ్చేవరకు ఆగండి’ అంటూ మహిళా రైతు కుటుంబం వేడుకున్నా అధికారులు వినిపించుకోలేదు. రెండు గంటలపాటు సర్వేను అడ్డుకున్న అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివాదాస్పద భూమిపై న్యాయపోరాటం కొనసాగుతున్న సమయంలోనే పోలీసు బందోబస్తుతో వెళ్లి హద్దులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పోళ్లు నాటేందుకు బొక్కలు పెడుతున్న డ్రిల్లింగ్ మిషన్
రైతు లక్ష్మీదేవమ్మను బలవంతంగా పక్కకు లాగేస్తున్న మహిళా పోలీసులు
కోర్టులో కేసు ఉండగానే
‘హద్దులు’ దాటిన వైనం
ఎమ్మెల్యే పరిటాల సునీత అండతోనే బరితెగించారని బాధిత కుటుంబీకుల కన్నీటిపర్యంతం


