నేమకల్లులో సుదర్శన హోమం | - | Sakshi
Sakshi News home page

నేమకల్లులో సుదర్శన హోమం

Sep 3 2026 3:57 AM | Updated on Sep 3 2026 3:57 AM

బొమ్మనహాళ్‌: నేమకల్లు ఆంజనేయస్వామి బాలాలయంలో శ్రావణమాస బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సుదర్శన హోమం నిర్వహించారు. ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌చార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి పవిత్ర గంగాజలాభిషేకం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో వేదపండితులు సుదర్శన హోమం హోమాన్ని నిర్వహించారు.

విత్తన పప్పుశనగకు ప్రతిపాదనలు

అనంతపురం అగ్రికల్చర్‌: రబీలో ప్రధానపంట పప్పుశనగ సాగుకు వీలుగా రైతులకు రాయితీపై ఇవ్వడానికి జిల్లాకు 45వేల క్వింటాళ్ల విత్తనం అవసరం అవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు బుధవారం కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపారు. ఖరీఫ్‌లో అక్కడక్కడా నల్లరేగడి భూములు ఖాళీగా ఉన్నందున ఈసారి కేటాయింపులు చేయాలని కోరినట్లు తెలిపారు.

రైతును బలిగొన్న విద్యుదాఘాతం

బెళుగుప్ప: పంటకు నీరు పెట్టడానికి వెళ్లిన రైతును విద్యుదాఘాతం బలితీసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జీడిపల్లిలో కమ్మర చిన్న రామాంజనేయులు (64)కు మూడు ఎకరాల భూమి ఉంది. రెండు నెలల క్రితం బ్యాడిగ రకం మిర్చి సాగు చేశాడు. బుధవారం మధ్యాహ్నం పంటకు నీరు పెట్టడానికి పొలం వెళ్లాడు. స్టార్టర్‌ బాక్స్‌లో స్విచ్‌ ఆన్‌ చేయగానే.. మోటర్‌ వద్దకు వెళ్లే కేబుల్‌ తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో భార్య రామక్క స్థానిక వ్యక్తిని తోటకు పంపింది. అయితే అప్పటికే రామాంజనేయులు విగతజీవిగా పడి ఉండటం గమనించాడు. వెంటనే సమీప రైతుల సాయంతో విద్యుత్‌ వైర్లను తొలగించి మృతదేహాన్ని పక్కకు తీశారు. రామాంజనేయులుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులకు, విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించారు.

మాటలతో రెచ్చగొట్టి.. చితకబాది..

అనంతపురం సిటీ: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పార్కింగ్‌ కాంట్రాక్ట్‌ సిబ్బంది దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. వారి సూచనలు పాటించకపోతే బూతులతో రెచ్చిపోతారు. దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. బుధవారం ఉదయం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ఉప్పునేసిన పల్లికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు ద్విచక్ర వాహనంపై సర్వజనాస్పత్రికి వచ్చాడు. అప్పటికే చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయిన తన తండ్రికి అవసరమైన మందుల కోసం వచ్చిన అతను తన వాహనాన్ని పార్క్‌ చేస్తున్న సమయంలో అక్కడున్న సిబ్బంది పక్కకు తీసుకెళ్లి పెట్టాలని తెలిపారు. దీంతో అతను మందులు తీసుకుని వెంటనే వెళ్లిపోతానని అనడంతో సిబ్బంది ససేమిరా అన్నారు. మాటలతో రెచ్చగొట్టి యువకుడిని పక్కకు నెట్టారు. స్వీయ రక్షణలో భాగంగా యువకుడు ప్రతిఘటించడంతో సిబ్బంది చుట్టుముట్టి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఏఎంసీలో చేర్చారు.

బాధితుడిపైనే ఫిర్యాదు

బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు సర్వజనాస్పత్రి అవుట్‌ పోస్ట్‌ పోలీసులు పార్కింగ్‌ కాంట్రాక్ట్‌ సిబ్బందిపై కేసు నమోదుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్‌ వెంటనే అప్రమత్తమై సదరు యువకుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసేలా పావులు కదిపాడు. వాహనాన్ని పక్కన పెట్టమని చెప్పినందుకు తమపైనే యువకుడు దాడి చేసి గాయపరిచాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాలపై కేసుల నమోదుకు రెండో పట్టణ పోలీసులకు అవుట్‌పోస్టు సిబ్బంది సిఫారసు చేశారు. ఈ విషయమై సర్వజనాస్పత్రి పరిపాలనా అధికారి మల్లికార్జునరెడ్డిని వివరణ కోరగా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు ఇబ్బంది కలిగిస్తే పార్కింగ్‌ కాంట్రాక్ట్‌ టెండర్‌ను రద్దు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement