ఉరవకొండ: ఉరవకొండలోని ప్రసిద్ధి గాంచిన హజరత్ బీబీ జైనబ్బీ అమ్మవారి దర్గా హిందూ– ముస్లింల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తోంది. రాష్ట్రంలోనే ఏకై క అమ్మవారి దర్గా కావడం గమనార్హం. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
ఎన్నో ప్రత్యేకతలు..
జైనబ్బీ దర్గా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. కర్ణాటకలోని గుల్బర్గా దర్గా తరహాలో జైనబ్బీ అమ్మవారి జీవ సమాధిపై గాజు గోపురం అద్భుతంగా ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియా దేశంలోని పవిత్ర మక్కా వద్ద ఉన్న జన్నత్‌కా దర్వాజ తరహాలో దర్గాకు ప్రధాన ద్వారం నిర్మించారు. అజ్మీర్ దర్గా తరహాలో డేగ్‌తో పాటు అమ్మవారి సమాధి చుట్టూ ఖరీదైన పాలరాయితో కాంపౌండ్ ఏర్పాటు చేశారు.
12 నుంచి అమ్మవారి ఉత్సవాలు..
ప్రసిద్ధి గాంచిన బీబీ జైనబ్బీ అమ్మవారి ఉరుసు ఈనెల 12న ప్రారంభం కానుంది. మొదటి రోజు గంధం వేడుకలు, 13న ఉరుసు, 14న జియారత్ వేడుకలు నిర్వహించనున్నారు. దీంతో పాటు 13, 14 తేదీల్లో దర్గా ఆవరణలో ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఖవ్వాలీ పోటీదారులతో గొప్ప ఖవ్వాలీ పోటీలు ఉంటాయి.
రాష్ట్రంలోనే ఏకై క అమ్మవారి దర్గా
అద్భుతమైన కళాఖండాలతో
విరాజిల్లుతున్న వైనం
12 నుంచి అమ్మవారి ఉరుసు
చురుగ్గా ఏర్పాట్లు
జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక నుంచి కూడా ఉరుసుకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలతో పాటు దర్గాను సుందరంగా ముస్తాబు చేయించాం. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాం. దర్గా కమిటీ సభ్యుల సహకారంతో పాటు అధికారుల సమన్వయంతో ఉరుసును విజయవంతం చేస్తాం.
– హోతూరు బాషా,
దర్గా కమిటీ అధ్యక్షుడు, ఉరవకొండ


