అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన అర్జీలను కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అధికారులకు అందజేయాలన్నారు. ప్రజలు తమ అర్జీలో ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని తెలిపారు.
ముగ్గురు ఇంజినీరింగ్
విద్యార్థినుల అదృశ్యం
అనంతపురం సెంట్రల్: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనంతపురంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు జేఎన్‌టియూలో చదువుతున్నారు. నాలుగురోజుల క్రితం కళాశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ముగ్గురు విద్యార్థినులు మాత్రమే వెళ్లారని, ఇందులో ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని తెలిసింది. దీంతో జేఎన్‌టీయూ కాలేజీలో ఏవైనా ఇబ్బందులున్నాయా, మరే ఇతరత్ర సమస్యలతో వెళ్లారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా ముగ్గురు విద్యార్థినుల్లో ఒకరు తిరిగి వచ్చినట్లు సమాచారం. అయితే దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు.
చదువుతోనే గిరిజనుల
జీవితాల్లో మార్పు
అనంతపురం ఎడ్యుకేషన్/ టవర్‌క్లాక్: చదువుతోనే గిరిజనుల జీవితాల్లో మార్పు వస్తుందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అనంతపురంలోని గిరిజన భవన్‌లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప, రాష్ట్ర ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు సభావత్ సోమ్లానాయక్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గిరిజన బాలికల కోసం ఏర్పాటు చేస్తున్న వసతి పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు జరగకుండా చూడాలని కోరారు. అనంతరం వివిధ గిరిజన గురుకుల పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి కుష్బూ కొఠారి, ప్రిన్సిపాళ్లు మసూద్ వలి, ప్రవీణ్‌కుమార్, కేశవ నాయక్, డీవీఎంసీ సభ్యుడు పోలా మహేష్, సాకే వీరాంజనేయులు, మహేష్ నాయక్, శివశంకర్ నాయక్, అశ్వర్థ నాయక్, కావేటి ఉమామహేశ్వరి, సాకే ముసలయ్య, మల్లికార్జున నాయక్, ముత్యాలమ్మ, రవికుమార్ నాయక్ పాల్గొన్నారు.
జవహర్ నవోదయ
దరఖాస్తులకు నేటితో ఆఖరు
లేపాక్షి: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కోసం సోమవారంలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చన్నారు. నవంబర్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఎంపికై న విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.


