అనంతపురం అర్బన్: ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యాయి. ఎన్నికల హామీ మేరకు ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా రెండేళ్లుగా దాటవేస్తూ దగా చేస్తోందని మండిపడుతున్నాయి. పీఆర్‌సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన, సరెండర్ లీవ్‌లు, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల సాధన కోసం ఉద్యమిస్తామంటున్నాయి. పెన్షనర్ల పరిస్థితి మరింత అధ్వానంగా ఉందంటున్నాయి.
పీఆర్‌సీ.. ఐఆర్ ఊసేలేదు
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా 12వ పీఆర్‌సీ ఊసే లేదు. కమిషన్ నియమించకుండా ఉద్యోగుల రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కాలరాస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా ఇంత వరకూ అమలు గురించే పట్టించుకోలేదన్నారు.
ఐదు డీఏలు పెండింగ్
ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు (జనవరి– జూలై) ఒక డీఏ (కరువు భత్యం) ఇవ్వాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే 2024 జూలై నుంచి ఇప్పటి వరకు (2024 జూలై, 2025 జనవరి, జూలై, 2026 జనవరి, జూలై) ఐదు డీఏలను ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిందన్నారు. దీనికి తోడు సరెండర్ లీవ్స్‌కు సంబంధించి నగదు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.
పెన్షనర్ల పరిస్థితి దయనీయం..
ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి దయనీయంగా ఉందని నాయకులు చెబుతున్నారు. కొందరు ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.10 లక్షల వరకు ఈఎల్ (ఎర్న్‌డ్ లీవ్) రావాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఈఎల్ మంజూరు చేయలేదు.
అవాస్తవ లెక్కలతో శ్వేతపత్రం..
ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతన విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతప్రతం పూర్తిగా అవాస్తవ లెక్కలతో ఉందని ఉద్యోగ సంఘాలు నేతలు అంటున్నారు. ఈ రెండేళ్లలో దాదాపు 50 వేల మంది ఉద్యోగ విరమణ చేశారరు. కొత్తగా నియామకాలు చేపట్టలేదు. అలాంటప్పుడు ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందా..? పెరుగుతుందా...? అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా బడ్జెట్‌లో ఉద్యోగులకు వేతనాల కింద చెల్లిస్తున్నది 40 శాతం లోపే ఉండగా... ప్రభుత్వం 98 శాతంగా చూపడం వెనుక ‘ఇతరత్ర’ ఉద్దేశం కనిపిస్తోందని అంటున్నారు. ఉద్యోగుల విషయంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం కనిపిస్తోందని దుమ్మెత్తిపోస్తున్నారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు రెండేళ్లుగా దగా
వేతనాలపై అవాస్తవ లెక్కలతో
తప్పుడు సంకేతాలు
ఉద్యోగ, పెన్షనర్ల సంఘం నాయకుల మండిపాటు


