అనంతపురం: అనాది కాలంగా వస్తున్న సంప్రదాయాలు, సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్న ఆదివాసీలు సామాజిక, వైవిధ్యభరితమైన జీవ సంరక్షకులని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ పాల్గొని.. ఏకలవ్యుడు, అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్, సంత్ సేవాలాల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆదివాసీ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మీడియాతో మాట్లాడుతూ ప్రకృతితో మమేకమై జీవిస్తూ తరతరాలుగా తమ విలువైన సంప్రదాయాలను కాపాడుతున్న ఆదివాసీ సమాజం దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస నాయక్ (బాబు) మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనులకు రక్షణ కరువైందని విమర్శించారు. అనంతపురం నగరానికి చెందిన తన్మయి అనే గిరిజన విద్యార్థి హత్యకు గురైనా..ఇప్పటి దాకా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వత్థనాయక్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్ సైఫుల్లా బేగ్, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమర్‌నాథరెడ్డి, మాజీ కార్పొరేటర్ గుణశేఖర్ బాబు, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివశంకర్ నాయక్, ఎం.రామకృష్ణ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రవికుమార్ నాయక్, నగర అధ్యక్షుడు గుజ్జల శివయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, ఆదినాయక్, హనుమంతు నాయక్, పి.లక్ష్మణ నాయక్, మురళీ నాయక్, జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్ పాల్గొన్నారు.


