కూడేరు: ఉదిరిపికొండలో ‘ఒక గ్రామం – ఒక నెల –నాలుగు సందర్శనలు’ కార్యక్రమ ముగింపు సభ శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బంది పడుకుండా ఉండాలన్నదే ‘ఒక గ్రామం – ఒక నెల – నాలుగు సందర్శనలు’ కార్యక్రమ ఉద్దేశమన్నారు. గత మూడు సందర్శనల్లో ప్రజల నుంచి 312 అర్జీలు వచ్చాయన్నారు. మండల రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో సమగ్రంగా విచారణ జరిపి అర్హత ఉన్న 152 భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధన మేరకు అర్హత లేకపోవడంతో 95 అర్జీలను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. మరో 65 అర్జీలు చట్టపరమైన అంశాలకు సంబంధించినవి ఉండడంతో వాటిని నిబంధనల మేరకు పరిష్కరించడానికి అధికారులకు కొంత సమయం పడుతుందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రేమంత్ కుమార్, తహసీల్ధార్ మోహన్ కుమార్, సీఎస్‌డీటీ శాంతకుమారి, మండల సర్వేయర్ అయేషా సిద్ధిఖీ, పలు శాఖల అధికారులు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.
‘టెట్’కు 143 మంది గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు 143 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. రెండు విడతల్లో కలిపి మొత్తం 1,813 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 1,670 మంది హాజరయ్యారు. దీంతో 143 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అయూబ్ హుస్సేన్ తెలిపారు.
స్కాలర్‌షిప్ రెన్యూవల్ ప్రక్రియ పూర్తి చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పోస్టుమెట్రిక్ స్కాలర్ షిప్ పథకం కింద అర్హులైన విద్యార్థుల రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు రాజేశ్వరమ్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జ్ఞానభూమి వెబ్‌పోర్టల్‌లోని కళాశాల ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా అర్హులైన విద్యార్థుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. యూనివర్సిటీ అకడమిక్ క్యాలెండర్‌లో ఎంట్రీ చేసిన తేదీ నుంచి మూడు నెలల పాటు మాత్రమే రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుందని పేర్కొన్నారు. కళాశాలల్లో స్కాలర్‌షిప్ విభాగం విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తక్షణమే విద్యార్థుల రెన్యూవల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేసి, అర్హత ఉన్న ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్ ప్రయోజనాన్ని కోల్పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో జేఎన్‌టీయూ నంబర్ 1
● ఇండియా టుడే ర్యాంకింగ్స్‌లో వెల్లడి
అనంతపురం: దేశంలోని సాంకేతిక విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇండియా టుడే ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో జేఎన్‌టీయూ(ఏ)కు ఏపీలో నంబర్ వన్ స్థానం దక్కింది. అలాగే జాతీయ స్థాయిలో 20వ ర్యాంక్‌ను కై వసం చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన ఈ గుర్తింపుపై జేఎన్‌టీయూ(ఏ) వీసీ హెచ్.సుదర్శనరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు జేఎన్‌టీయూ(ఏ) కుటుంబం మొత్తానికి గర్వకారణమని పేర్కొన్నారు. అధ్యాపక బృందం, పరిపాలనా సిబ్బంది, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఇతర భాగస్వాములందరి సమష్టి కృషి, అంకితభావం ఫలితమే ఈ విజయం అని కొనియాడారు. ఈ గుర్తింపు విశ్వవిద్యాలయాన్ని మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ప్రేరేపిస్తుందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతిష్టను పెంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అద్భుతమైన విజయానికి అమూల్యమైన సహకారం అందించిన జేఎన్‌టీయూ(ఏ) కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


