● కొనసాగుతున్న రైతు కష్టాలు
అనంతపురం అగ్రికల్చర్: పంటల బీమా పథకాల్లో భాగంగా ఈ నెల 15 వరకు ఫసల్ బీమా కింద నోటిఫై అయిన కంది, ఆముదం, జొన్న, మొక్కజొన్న, ఎండుమిరప, వరి పంటలకు ప్రీమియం కట్టేందుకు గడువు పొడిగించినా మీ–సేవ, సీఎస్‌సీలో సర్వర్ సమస్య కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల సైట్ ఓపెన్ కాకపోవడం.. లేదంటే ఆధార్, 1–బీ లింక్ కాకపోవడం, అలాగే ఓటీపీ సమస్య కూడా ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూసినా పనికావడం లేదని ఆందోళన చెందుతున్నారు. వాతావరణ బీమా కింద నోటిఫై అయిన పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు ఆగస్టు ఒకటిన ముగిసిన విషయం తెలిసిందే. వాతావరణ బీమా కింద 86,653 మంది రైతులు 1,24,936 హెక్టార్లకు రూ.35 కోట్లు వరకు ప్రీమియం కట్టినట్లు తాజా నివేదిక వెల్లడి చేస్తోంది.
● ఫసల్‌బీమా గడువు ఈనెల 15 వరకు ఉన్నా... సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరుగుతోంది. ప్రస్తుతానికి 1,05,783 మంది రైతులు 1,69,386 హెక్టార్ల పంటలకు ప్రీమియం చెల్లించారు. మొత్తం మీద రెండు బీమా పథకాల కింద జిల్లాలో 1,92,436 మంది రైతులు 2,94,322 హెక్టార్లకు తమ వాటా కింద ప్రీమియం చెల్లించి బీమా పరిధిలోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.


