ఎట్టకేలకు డీఈఓ నియామకం | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు డీఈఓ నియామకం

Aug 4 2026 12:17 AM | Updated on Aug 4 2026 12:17 AM

‘డైట్‌’ సీనియర్‌ అధ్యాపకుడు అయూబ్‌ హుసేన్‌కు ఎఫ్‌ఏసీ బాధ్యతలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లా విద్యాశాఖలో నెలలుగా కొనసాగుతున్న పరిపాలనా అని శ్చితికి ఎట్టకేలకు తెరపడింది. డీఈఓ పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) డాక్టర్‌ ఎన్‌.అయూబ్‌ హుసేన్‌కు అప్పగిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్షారియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం ఉత్తర్వులు అందుకున్న అయూబ్‌ హుసేన్‌ మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రస్తుతం కర్నూలు జిల్లా డైట్‌ కళాశాలలో సీనియర్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఈఓ చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డీవైఈఓలు శ్రీనివాసరావు, లక్ష్మన్న, కార్యాలయ ఏడీలు మునీర్‌ఖాన్‌, శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు, సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

రెండు నెలలుగా

ఎఫ్‌ఏసీ లేక ఇబ్బందులు

గతంలో డీఈఓగా పని చేసిన ప్రసాద్‌బాబు అనారోగ్య కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జిల్లా విద్యాశాఖలో పరిపాలన ఇబ్బందులు తలెత్తాయి. ఆయన సెలవులోకి వెళ్లిన తర్వాత డీవైఈఓ శ్రీనివాసరావు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించినప్పటికీ, పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) లేకపోవడంతో కీలకమైన పరిపాలనా ఫైళ్లు పెండింగ్‌లోనే నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో విద్యాశాఖ పాలన గాడి తప్పింది.

ఒత్తిళ్లతో ప్రసాద్‌బాబు సెలవు?

ప్రసాద్‌బాబు ఏడీగా పనిచేస్తున్న సమయంలో డీఈఓగా ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వహిస్తూ అందరితో సమన్వయంగా వ్యవహరించిన అధికారిగా గుర్తింపు పొందారు. అయితే ఉన్నతాధికారుల ఒత్తిళ్ల నేపథ్యంలో అనారోగ్యానికి గురయ్యారని, చికిత్స అనంతరం విధుల్లో చేరడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు తిరిగి విధుల్లో చేరిన కొద్దికాలానికే మళ్లీ ఒత్తిళ్లు పెరగడంతో ఆరోగ్య దృష్ట్యా దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లినట్లు సమాచారం.

మళ్లీ ఇన్‌చార్జ్‌ పాలన తప్పదా?

డాక్టర్‌ అయూబ్‌ హుసేన్‌ ఈ ఏడాది నవంబర్‌లో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన పదవీకాలం కూడా కొద్దికాలమే ఉండనుంది. అనంతరం మళ్లీ ఇన్‌చార్జ్‌ పాలన కొనసాగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖకు శాశ్వత డీఈఓను నియమించి పరిపాలనలో స్థిరత్వం తీసుకురావాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement