అనంతపురం అర్బన్: మోచేతి కింది భాగంలో చేయి కోల్పోయిన వారికి రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న చేయూత కార్యక్రమం ద్వారా ఉచితంగా కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ‘చేయూత’ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారు ముందుస్తుగా తమ వివరాలను ‘చేయూత’ కాల్ సెంటర్ 88663 06969కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. 30న నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చన, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కేశవరెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడు లక్ష్మీనారాయణ, సుంకర రమేష్, బిసాతి భారత్, దాసరి భరత్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరిగి తిరిగి అలసిపోతున్నాం
అనంతపురం అర్బన్: తిరిగి తిరిగి అలసిపోతున్నామని, కనికరించి తమ సమస్యలు పరిష్కరించండి అని ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ ఆనంద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్‌కుమార్, డీఆర్‌ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, కిరణ్మయి రెవెన్యూ సమస్యలపై 286, ఇతర సమస్యలపై 413 చొప్పున మొత్తం 699 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
అర్జీల్లో మచ్చుకు కొన్ని..
● బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన గంగపన్న అనే దివ్యాంగుడు నడవలేనిస్థితిలోనే దోక్కుంటూ కలెక్టరేట్‌కు వచ్చాడు. మూడు చక్రాల సైకిల్ కోసం రెండేళ్లకు పైగా విన్నవించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు.
● నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్, కళాశాల స్థలాన్ని ఆక్రమించారని 1091–92 బ్యాచ్ పూర్య విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కళాశాలకు సర్వేనంబర్ 139/1డిలో 10.02 ఎకరాలు ఉందన్నారు. ఇక్కడ స్థలం సెంటు రూ.20 లక్షలు ఉందన్నారు. అయితే కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ వాహనాల పార్కింగ్ కోసం కళాశాలకు చెందిన దాదాపు 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించారని చెప్పారు.
● వితంతు పింఛను మంజూరు చేయాలని కణేకల్లు మండలం మాల్యం గ్రామానికి చెందని బి.ఆదిలక్ష్మి, గుమ్మఘట్ట మండలం రంగసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన ఎం.బేబి విన్నివించారు.


