అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ ద్వారా తేనెటీగల పెంపకానికి ముందుకు వచ్చే లబ్ధిదారులకు రాయితీతో ప్రోత్సహిస్తామని ఆ శాఖ డీడీ ఉమాదేవి తెలిపారు. హార్టికల్చర్ ఆఫీసర్ రత్నకుమార్‌తో కలిసి ఆదివారం రూరల్ మండలం సిండికేట్‌నగర్ సమీపంలో నల్లమల హనీబీ పార్క్‌తో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. తేనేటీగల పెంపకం, పెట్టుబడులు, ఆదాయం, మార్కెటింగ్ తదితర విషయాల గురించి శిక్షణ కేంద్రం నిర్వాహకుడు రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. తేనెటీగల వల్ల ఆదాయంతో పాటు ఉద్యాన పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి మంచి దిగుబడులు వస్తాయన్నారు. కేంద్ర నిల్వ ఉత్పత్తి కేంద్రం, తేనెటీగల కాలనీ ఉత్పత్తి, తేనెటీగల సమూహం, తేనెటీగల గూళ్లు, తేనెతీసే యంత్రం... ఇలా ఈ రంగానికి వివిధ రూపాల్లో రాయితీలు వర్తిస్తాయన్నారు. యూనిట్ విలువపై 40 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. ప్రధానంగా ఉద్యానతోటల్లో అదనంగా తేనెటీగల పెంపకం చేపడితే అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. తేనెటీగల వల్ల పురుగు మందుల పిచికారీ ఖర్చు తగ్గడమే కాకుండా మంచి పంట దిగుబడులు వచ్చినట్లు దానిమ్మ రైతు గంగాధర్‌రెడ్డి తెలిపారు.


