అనంతపురం టౌన్: తపాలశాఖ అనుబంధంగా పనిచేస్తున్న పార్సిల్ సర్వీసులకు ధరలను తగ్గిస్తూ కొత్త టారీఫ్‌లను ఇండియా పోస్టు ప్రవేశపెట్టినట్లు తపాలశాఖ అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ అమర్‌నాథ్ ఒక ప్రకనటో తెలిపారు. తగ్గింపు టారిఫ్‌లతో వ్యాపార సంస్థలు, ఈ కామర్స్ విక్రేతలు, వస్తు తయారీ సంస్థలు, హోల్‌సెల్, రిటైల్ వ్యాపారస్తులు, బల్క్ పార్సెల్ వినియోగదారులకు అనువుగా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడికై న 500 గ్రాముల లోపు పార్సిల్‌ను పంపితే గతంలో రూ.100కు పైగా ఉండేదన్నారు. ప్రస్తుతం రూ.35 లోపే ధర ఉంటుందన్నారు. దీంతో పాటు మెట్రో ప్రాంతాలకు పంపే పార్సెల్స్ ధరలను బాగా తగ్గించామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‘ఆశావాది’ సాహితీ సేవలు చిరస్మరణీయం
అనంతపురం కల్చరల్: స్వయంకృషితో ఎదిగిన మహోన్నత సాహితీ శిఖరం డాక్టర్ ఆశావాది ప్రకాశరావు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు నిరుపమామని పలువురు వక్తలు కొనియాడారు. ఆశావాది సాహితీ పురస్కార ప్రదానోత్సవం ఆదివారం ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఘనంగా జరిగింది. ఆశావాది శశాంక మౌలి అధ్యక్షతన జరిగిన పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు సాహితీ ఉత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులకు పురస్కారాలను అందించారు. మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధికార ప్రతిఽనిధి డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగకు ‘సామాజిక సేవా పురస్కారం,’ హైదరాబాద్‌కు చెందిన నల్లాన్ చక్రవర్తుల సాహిత్‌కు ‘అవధాన పురస్కారం’, పద్యబంధ కవి అన్నమరాజు ప్రభాకరరావుకు ‘సాహిత్య పురస్కారం’ అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శతావధాని కళారత్న ఆముదాల మురళి, జనప్రియ కవి ఏలూరు యంగన్న, డాక్టర్ వైస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీత శాంతినారాయణ, వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రముఖ గాయకులు ముండ్లపాటి వెంకటసుబ్బయ్య, హైదరాబాదుకు శిల్పి కళారత్న డాక్టర్ గొల్లపల్లి జయన్న , సంస్కృత ఉపన్యాసకులు ఆశావాది సుధామ వంశి తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేసి ఆశావాది సాహిత్యంలోని విశిష్టతలను తెలియజేశారు. ఈ సందర్భంగా అవధానాచార్య పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు సాహితీపీఠం లోగోను ఆవిష్కరించారు.
సంతల ఆదాయం రూ.3.17 లక్షలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఈ వారం జరిగిన జీవాలు, పశువుల సంతల ద్వారా రూ.3.17 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు చైర్‌పర్సన్ బల్లా పల్లవి, సెక్రటరీ కె.గోవిందు తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ.1.57 లక్షలు, ఆదివారం జరిగిన పశువులు, గేదెలు, ఎద్దుల సంత నుంచి రూ.1.60 లక్షలు మేర వసూలైనట్లు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాయదుర్గం రూరల్: మండల పరిధిలోని 74 ఉడేగోళం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిదురు బొమ్మయ్య కుమారుడు బి.ఓబయ్య (38) మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మృతుడు ఓబయ్య గ్రామంలో నుంచి సబ్‌స్టేషన్ వెనుక భాగాన ఉన్న తన ఇంటికి ద్విచక్ర వాహనం బయలుదేరాడు. అయితే హైవేపై రోడ్డు దాటుతుండగా రాయదుర్గం నుంచి అనంతపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 39జడ్ 0704) ఢీ కొంది. స్థానికులు రాయదుర్గం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు ఓబయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడన్నారు. మృతుడికి భార్య సూరమ్మ, 10వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నట్లు తెలిపారు. గ్రామంలోకి వెళ్లొస్తానని చెప్పి , తిరిగరాని లోకాలకు వెళ్లావా అంటూ మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రూరల్ సీఐ వెంకటరమణ, అర్బన్ ఎస్‌ఐ సురేష్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళ మెడలో బంగారు చైన్ అపహరణ
రామగిరి: మండలంలోని మక్కినవారిపల్లిలో శనివారం అర్ధరాత్రి అశ్వర్థమ్మ అనే మహిళ మెడలోని నగలను దొంగలు అపహరించారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం అర్ధరాత్రి ఇంటి సమీపంలో అశ్వర్థమ్మ బహిర్బూమికి వెళ్లింది. ఈ సమయంలోనే దుండగులు ఆమె మెడలోని తాళిబొట్టు చైన్‌ను లాక్కెళ్లారు. చైన్ సుమారు మూడు తులాల ఉంటుందని బాధితురాలు పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


