అనంతపురం ఎడ్యుకేషన్: ప్రత్యేక అవసరాల గల (సీడబ్ల్యూఎస్‌ఎన్) పిల్లలు, తల్లిడండ్రులకు శుభవార్త. ఇన్నాళ్లు సదరం సర్టిఫికెట్లు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్న పరిస్థితికి త్వరలో తెరపడనుంది. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సదరం సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. దీంతో జిల్లాలో సుమారు 1,100 మంది ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందనున్నాయి.
సంక్షేమానికి దూరం..
జిల్లాలో 6 నుంచి 18 ఏళ్లలోపు ప్రత్యేక అవసరాల గల విద్యార్థులు 4,090 మంది ఉన్నారు. వీరిలో 1,100 మందికి సదరం సర్టిఫికెట్లు లేవు. దీంతో ప్రభుత్వ పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలు, అలిమ్కో ద్వారా అందించే సహాయక పరికరాలు వంటి అనేక ప్రయోజనాలకు వారు దూరమవుతున్నారు. సదరం సర్టిఫికెట్ పొందాలంటే ప్రభుత్వం విడుదల చేసే ఆన్‌లైన్ స్లాట్‌లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్లాట్‌లు పరిమితంగా ఉండడం, కొద్దిసేపే అందుబాటులో ఉండటం, తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, రోజువారీ కూలీ పనులకు వెళ్లడం వంటి కారణాలతో చాలామంది నమోదు చేసుకోలేకపోయారు. ఫలితంగా అర్హత ఉన్నప్పటికీ వందలాది మంది పిల్లలు ప్రతి ఏడాది ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోతున్నారు.
కలెక్టర్ చొరవతో ప్రత్యేక డ్రైవ్..
సమస్యను సమగ్ర శిక్ష అధికారులు కలెక్టర్ ఓ. ఆనంద్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత ఫైల్ తెప్పించి రాష్ట్ర అధికారులతో చర్చించారు. ఫలితంగా జిల్లాకు ప్రత్యేకంగా సదరం సర్టిఫికెట్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అనుమతి లభించింది.
ఇదీ షెడ్యూల్ ..
ఈ నెల 8న ప్రత్యేక లింక్ అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్‌లో అర్హులైన విద్యార్థుల వివరాలు నమోదు చేయనున్నారు. 19,20,21,22,24 వరకు స్లాట్ బుకింగ్‌లు నిర్వహిస్తారు. తల్లిదండ్రులు తమకు అనుకూలమైన తేదీని ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల ధ్రువీకరణ ఆధారంగా సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. సర్టిఫికెట్ పొందిన తర్వాత అర్హులైన విద్యార్థులకు దివ్యాంగుల పింఛన్లు, అలిమ్కో ద్వారా అందించే సహాయక పరికరాలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందే అవకాశం ఉంది.
సదరం సర్టిఫికెట్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌కు కలెక్టర్ ఆనంద్ చొరవ
ఆగస్టు 8న ప్రత్యేక లింక్.. 19 నుంచి 24 వరకు స్లాట్ బుకింగ్‌లు
అవకాశాన్ని వినియోగించుకోవాలి
కలెక్టర్ ప్రత్యేక చొరవతో వచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఐఈఆర్పీలు, ఐఈడీఎస్‌ఎస్ ఉపాధ్యాయులు తమ పరిధిలోని అర్హులైన ప్రతి ప్రత్యేక అవసరాల విద్యార్థిని ఈ ప్రత్యేక డ్రైవ్‌కు తీసుకురావాలి.
– శైలజ సమగ్ర శిక్ష ఏపీసీ. ఫణిరాజు ఐఈడీ కోఆర్డినేటరు


