అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని అటల్ ఇంక్యుబేషన్ కేంద్రానికి చెందిన ఇద్దరు గ్రామీణ ఆవిష్కర్తలకు జాతీయ సత్కారం దక్కింది. గ్రామీణ భారతదేశానికి ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశంపై గరిగంటి సుధాకర్ బాబుకు, రాయలసీమ మోసంబి రైతుల కోసం విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి అంశానికి సంబంధించి ఉషన్ శివరామ్‌ను ఘనంగా సత్కరించారు. దేశ వ్యాప్తంగా కేవలం 26 మంది ఎంపిక కాగా, వారిలో ఇద్దరు ఎస్కేయూ అటల్ ఇంక్యుబేషన్ కేంద్రానికి చెందిన వారు కావడం గమనార్హం. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో గ్రాస్‌రూట్స్ ఇన్నోవేటర్ రికగ్నేషన్–2026 కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వారిని సత్కరించారు. ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్ వారిని అభినందించారు.


