శింగనమల: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5 వ తరగతి వరకూ 40 మంది విద్యార్థులున్నారు. అయితే విద్యార్థులందరూ ఒకే గదిలోనే కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. మరో గది ఉన్నా .. పైకప్పు పెచ్చులు పడుతుండడంతో అందరికీ ఒకే గదిలోనే చదువు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దెబ్బతిన్న భవనానికి మరమ్మతు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనికి తోడు పాఠశాల సమీపంలోనే మురికికాలువలు పూడిపోవడంతో దోమలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి భవనాలకు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.


