అమ్మపాలు అమృతమే | - | Sakshi
Sakshi News home page

అమ్మపాలు అమృతమే

Aug 2 2026 1:40 AM | Updated on Aug 2 2026 1:40 AM

7వ తేదీ వరకూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
‘అమ్మ’ అనే పదంలోనే ఆప్యాయత, అనురాగం వంటి సుగుణాలు మిళితమై ఉన్నాయి. అలాంటి అమ్మ పాలు బిడ్డకు జీవామృతమే అంటే అతిశయోక్తి కాదు. తల్లి పాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించడం కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ వరకూ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

శిశువు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు పట్టించడం శ్రేష్ఠం

ముర్రుపాలతో వ్యాధి నిరోధక శక్తి పెంపు

రాయదుర్గంటౌన్‌: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలతో బిడ్డ పుట్టిన రెండు,మూడు రోజుల వరకూ తల్లిపాలు ఇవ్వడం లేదు. పట్టణాల్లో నివసించే వారు పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి బిడ్డకు పాలివ్వడం లేదు. దీంతో బిడ్డలతో పాటు తాము కూడా నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేకపోతున్నారు. దేశంలో ప్రతి ఏడాది నీళ్ల విరేచనాలు, నిమోనియా వంటి జబ్బులతో లక్ష మంది ఏడాది లోపు శిశువులు మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవిస్తున్న మరణాలను 50 శాతం వరకూ తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ పేర్కొంటున్నాయి. మొదటి ఆరు నెలలు ఎటువంటి డబ్బా పాలు పట్టించకుండా, తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. సాధారణ ప్రసవమైతే పుట్టిన అరగంటలోపు తల్లిపాలు పట్టించాలి. సిజేరియన్‌ అయితే నాలుగు గంటల లోపు ఇవ్వాలి.

సందర్భం

ఉపయోగాలిలా..

తల్లిపాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

మెదడు ఎదుగుదలతో జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.

శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి.

తల్లిపాలలో సహజిసిద్ధమైన ప్రోటీన్లు, లాక్టొఫెరిన్‌, కోలోస్ట్రమ్‌, కొన్ని కీలకమైన హార్మోన్లు, రోగ నిరోధక బ్యాక్టీరియా ఉంటాయి.

పసిబిడ్డకు ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లి శరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. తల్లీబిడ్డ మధ్య అనుబంధం పెరుగుతుంది.

బిడ్డకు పాలిచ్చే మహిళలు బ్రెస్ట్‌ క్యాన్సర్‌, అండాశయ క్యాన్సర్‌, రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది.

అపోహలు మానుకోవాలి

మర్రుపాలపై నేటికీ చాలా అపోహలు ఉన్నాయి. పుట్టిన అరంగంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టిస్తే ఆరోగ్యం పంచినట్లే అవుతుంది. శిశుమరణాలు కూడా తగ్గుతాయి. తల్లిపాలు తాగిన పిల్లలు చురుగ్గా ఉంటారు. బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

– మెర్సీ జ్ఞానసుధ, సూపరింటెండెంట్‌, రాయదుర్గం ఏరియా ఆస్పత్రి

మొదటి వ్యాధి నిరోధక టీకా

బిడ్డ పుట్టిన అరగంటలోపు తల్లిపాలు ఇవ్వాలి. ఇది స్వయంగా బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి వ్యాధి నిరోధక టీకా అవుతుంది. తర్వాత ఆరు నెలలు నిండే వరకూ కేవలం తల్లిపాలే పట్టించాలి. ఎండాకాలమైనా సరే నీరివ్వాల్సిన అవసరం లేదు. అంగన్‌వాడీలో ఇచ్చే పోషణ్‌ కిట్స్‌తోపాటు ఇతర మృదువైన, సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు సమయానుసారంగా పెంచాలి.

– బి.లక్ష్మీప్రసన్న, సీడీపీఓ, రాయదుర్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement