కూడేరు: మండల పరిధిలోని కరుట్లపల్లికి చెందిన లక్ష్మమ్మకు 110 ఏళ్లు నిండాయి. శనివారం కుటుంబ సభ్యులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా.. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. లక్ష్మమ్మకు శాలువ కప్పి, పూలమాల వేసి సన్మానించారు. ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శివరామి రెడ్డి మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. వారి ఆశీర్వాదాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. లక్ష్మమ్మ ఆరోగ్యంగా మరిన్ని సంవత్సరాలు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, మాజీ ఎంపీపీ రమణా రెడ్డి, రామాంజనేయులు, చంద్రమోహన్ రెడ్డి, తిప్పారెడ్డి, గురుమూర్తి, శ్రీరామిరెడ్డి, నాగిరెడ్డి, ఎంసీ ఆంజనేయులు, శైలాద్రి, సతీష్, శశికాంత్ నీలకంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): మండలంలోని ఓబులాపురం–బళ్లారి రైల్వే మార్గంలోని ట్రాక్‌పై శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. 50 ఏళ్లు పైబడిన వ్యక్తి సాయంత్రం 5 గంటల సమయంలో గూడ్స్ కింద పడి మృతి చెందాడు. గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఎవరికై నా తెలిసి ఉంటే 9247575605 నంబర్‌కు తెలపాలని ఏఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి కోరారు.
బైపీసీ విద్యార్థులకూ ‘బీటెక్’
అనంతపురం: మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను బీటెక్ బయో ఇన్‌ఫర్మాటిక్స్ కోర్సులో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆ యూనివర్సిటీ వీసీ డాక్టర్ యువరాజ్ వెల్లడించారు. జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల సమ్మేళనంగా రూపొందించిన ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, ఔషధ పరిశోధన, జీనోమిక్స్, బయోలాజికల్ డేటా అనాలిటిక్స్ తదితర అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వీసీ తెలిపారు. బయాలజీతో పాటు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విద్యార్థులకు సమగ్ర శిక్షణ అందించేందుకు ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధనా సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్యప్రణాళిక, ప్రాజెక్టులు, పరిశోధన, ఇంటర్న్‌షిప్‌లు, కెరీర్ మార్గదర్శకత్వం ద్వారా విద్యార్థులను భవిష్యత్తు అవకాశాలకు సన్నద్ధం చేస్తామని వివరించారు. ప్రతి సెమిస్టర్‌కు సాధారణ ఫీజు రూ.80వేలు కాగా, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రత్యేక ఫీజు రాయితీలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 10+2 ఇంటర్మీడియెట్‌లో బైపీసీ, ఎంబైపీసీ లేదా ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, ఆసక్తి కలిగిన విద్యార్థులు www.admission.mits.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 8712655132/ 8712655138 నంబర్లను సంప్రదించాలని కోరారు.
మహిళ మెడలో బంగారు చైన్ అపహరణ
కూడేరు: మండల పరిధిలోని కమ్మూరులో నాగరత్నమ్మ అనే మహిళ మెడలోని బంగారు చైన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. బాధితురాలి వివరాల మేరకు.. శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి తన భార్య నాగరత్నమ్మతో కలిసి అనంతపురం నుంచి ద్విచక్ర వాహనంలో గ్రామం దగ్గరకు రాగానే ఫోన్ కాల్ వచ్చింది. దీంతో బైకు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. వారిని ద్విచక్రవాహనంలో వెంబడించిన ఇద్దరు వ్యక్తులు గార్లదిన్నెకు ఎలా వెళ్లాలంటూ మాటలు కలిపి ఆమె మెడలోని 3 తులాల చైన్ బంగారు చైన్‌ను లాక్కొని ఉడాయించారు. బాధితురాలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఓటీపీ అడిగి.. 90 వేలు ఊడ్చి!
గుంతకల్లు: సైబర్ వలలో పడి ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతాలోని రూ.90,000 నగదు పోగొట్టుకున్నాడు. వివరాలు.. గుంతకల్లు గంగానగర్‌లో నివాసముంటున్న కమల్‌బాషా మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. తనకు కొంత డబ్బు అవసరం ఉండి క్రెడిట్ నోవా యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నాడు. దరఖాస్తు చేసుకున్న సమయంలో ప్లస్ 923330445343 నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. వారు అడిగిన ప్రకారం వివరాలు తెలియజేయడంతో పాటు ఓటీపీ చెప్పాడు. 15 నిమిషాల్లో కమల్‌బాషా ఖాతా(కరూర్ వైశ్య బ్యాంక్)లోని రూ.90,000 ఖాళీ అయ్యింది. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.


