ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే డీఎస్సీలో స్కామ్ చేసిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో అర్హత ఉన్న ఎంతో మంది నిరుద్యోగులు టీచర్ పోస్టులను కోల్పోయారన్నారు. తమ పార్టీ నేతలతో పాటు లక్షలాది మంది యువత ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి డీఎస్సీ నిర్వహణలో కీలక బాధ్యతలను అప్పగించగా, ఆయనకే ప్రథమ ర్యాంకు వచ్చిందని తెలిపారు. నిబంధనలు తుంగలో తొక్కి స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచారని ధ్వజమెత్తారు. సర్వీస్ రూల్స్ సవరించి క్రీడల్లో పాల్గొన్న వారు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదనే జీఓ తెచ్చి అనేక మందికి పోస్టులను కట్టబెట్టారని దుయ్యబట్టారు. 29 రకాల ఆటలను 64కు పెంచి చివరికి పేకాట, టగ్‌ఆఫ్ వార్‌ను సైతం క్రీడలుగా ప్రకటించి ఉద్యోగాలను కట్టబెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. నీట్ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విధంగానే మంత్రి లోకేష్ డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై యువత, విద్యార్థులు ధర్మ యుద్ధానికి సిద్ధం కావాలని, జంతర్ మంతర్ వద్ద కాక్రోజ్ జనతా పార్టీ తరహాలోనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నవీన్‌కుమార్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్‌రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు సాకే పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.


