బలహీనులపై ప్రతాపం చూపుతారా? | - | Sakshi
Sakshi News home page

బలహీనులపై ప్రతాపం చూపుతారా?

Aug 2 2026 1:40 AM | Updated on Aug 2 2026 1:40 AM

రిటైర్డు జడ్జి కిష్టప్ప మండిపాటు

అనంతపురం టవర్‌క్లాక్‌: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు వచ్చాక అధికార టీడీపీ నాయకుల భూదందాలు పెరిగిపోయాయని, బలహీనుల భూములను కబ్జా చేస్తూ వారిపై ప్రతాపం చూపుతున్నారని రిటైర్డు జడ్జి కిష్టప్ప మండిపడ్డారు. శనివారం ఆయన అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఎక్కడ చూసినా టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు మితిమీరి పోయాయన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వేల్పుమడుగు గ్రామంలో కురుబ గోవిందు అల్లుడు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే.. కొంతమంది అధికార పార్టీ పెద్దల అండదండలతో ఆ భూమిని కబ్జా చేసేందుకు పథకం వేశారన్నారు. టీడీపీలో చేరలేదన్న కారణంగా కురుబలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, న్యాయ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, సామాన్యులకు న్యాయం చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కురుబల జోలికొస్తే ఊరుకోం

ఎవరికీ ఎటువంటి ఇబ్బందులూ కలిగించని కురుబల జోలికి వస్తే ఊరుకునేది లేదని రిటైర్డు జడ్జి హెచ్చరించారు. కురుబలు ఆర్థికంగా ఎదగకూడదా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా.. ఎదిరించినందుకు ఎన్‌కౌంటర్‌ చేస్తారా.. ఇదెక్కడి రాజ్యాంగం అంటూ నిలదీశారు. కురుబల తరఫున న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతపురం రూరల్‌ మండలం పాపంపేటలో టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఇళ్లు కూల్చేశారని, అక్కడ బాధితులకు తాను అండగా నిలిచి పోరాటం చేశానని గుర్తు చేశారు. యువత సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ఢిల్లీలో యువత ఉద్యమిస్తే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా యువత ముందుకు వచ్చి సమాజం కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో ఆదినారాయణ, వశికేరి రమేష్‌, హనుమన్న, రైతు గోవిందు, రామచంద్ర, రాధాకృష్ణ, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement