టీబీ డ్యాంలో 36 టీఎంసీల నీరు | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంలో 36 టీఎంసీల నీరు

Jul 31 2026 2:03 AM | Updated on Jul 31 2026 2:03 AM

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయంలో గురు వారం 36.04 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 1,633 అడుగులకు గాను 1609.21 అడుగల మేర నీటిమట్టం ఉంది.ఇన్‌ఫ్లో 14,922 క్యూసెక్కులుండగా.. 3680 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1624.80 అడుగులతో 75.84 టీఎంసీల నీరు ఉంది.

జేఎన్‌టీయూ(ఏ)కు

ఎన్‌జీయూ 24వ ర్యాంకు

అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ)కు అరుదైన గుర్తింపు దక్కింది.జాతీయ గ్రీన్‌ యూనివర్సిటీ (ఎన్‌జీయూ) ప్రకటించిన ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ(ఏ)కు 24వ ర్యాంక్‌తో పాటు గోల్డ్‌ రేటింగ్‌ దక్కింది. ఇందుకు సంబంధించిన వివరాలను వర్సిటీ వీసీ హెచ్‌.సుదర్శనరావు గురువారం వెల్లడించారు. మొత్తం పది అంశాలకు సంబంధించిన సూచికలపై పనితీరును పరిగణనలోకి తీసుకుని ఎన్‌జీయూ ర్యాంకులను ప్రకటించిందన్నారు. సుస్థిరత వ్యూహం, నాయకత్వం, వెల్లడింపులు, హరిత భవనాలు, సామర్థ్యం, పునరుత్పాదకం, గ్రీన్‌హౌస్‌ వాయువుల జాబితా, డీకార్బనైజేషన్‌ ప్రయత్నాలు, కోర్సులు,అనుభవపూర్వక అభ్యాసం, సహ పాఠ్య కార్యకలాపాలు, ప్రచురణలు, పైలట్‌ ప్రాజెక్టులు, ఆవిష్కరణల బదిలీ, స్థానిక జాతులు, పర్యావరణ ప్రణాళిక, ప్రజా రవాణా, సైక్లింగ్‌, ఈవీ మౌలిక సదుపాయాలు, పంటకోత, పరిరక్షణ, గ్రే వాటర్‌ పునర్వినియోగం, విభజన, కంపోస్టింగ్‌, ప్లాస్టిక్‌ నిషేధాలు, ఎస్‌యూసీఎన్‌ సహకారాలు, స్థానిక ప్రభావం అంశాల్లో జేఎన్‌టీయూ(ఏ)కు మెరుగైన ర్యాంక్‌ దక్కడం అభినందనీయమన్నారు. ఈ ఘనత సాధనకు కృషి చేసిన వర్సిటీ అధ్యాపక బందానికి వీసీతో పాటు రిజిస్ట్రార్‌ ఎస్‌.కష్ణయ్య, ఐక్యూఏసీ డైరెక్టర్‌ ఆర్‌. పద్మసువర్ణ, వర్సిటీ ర్యాంకింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఓంప్రకాష్‌ అభినందనలు తెలిపారు.

పనితీరు మారకుంటే

చర్యలు తప్పవు

ఐసీడీఎస్‌ అధికారులు,

అంగన్‌వాడీలకు కలెక్టర్‌ హెచ్చరిక

అనంతపురం అర్బన్‌: ‘‘పిల్లల్లో తలెత్తే పౌష్టికాహార లోపాన్ని సరిగా పర్యవేక్షించడం లేదు. ఎదుగుదల లేని పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. ఇకనైనా పనితీరు మార్చుకోండి.అంగన్‌ వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తా. లోపాలు గుర్తిస్తే చర్యలు తప్పవు’’ అని కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎదుగుదల లేని పిల్లలపై సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీలు సరిగా శ్రద్ధ పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి కనీస సమాచారంతో రాకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తహీనత ఉన్న పిల్లల సంఖ్యను సున్నా శాతానికి తీసుకురావాలన్నారు. తక్కువ బరువున్న పిల్లలను ఎన్‌ఆర్‌సీలో చేర్చాలని, డ్రాపవుట్‌ అయిన చిన్నారులను తిరిగి అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఆదేశించారు. ప్రీ స్కూల్‌లో పిల్లల నమోదు తగ్గకుండా చూసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కచ్చితమైన డేటా నమోదు చేయకపోతే చర్యలు తప్పవన్నారు. బాల్యవివాహాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ షాహిదా, డీఆర్‌డీఏ పీడీ శైలజ, డీఎస్‌ఓ శోభరాణి పాల్గొన్నారు.

● పిల్లల ఎదుగుదల పర్యవేక్షణలో పురోగతి చూపని కళ్యాణదుర్గం సూపర్‌వైజర్‌ సుధారాణి, కణేకల్లు సీడీపీఓ నాగమణి, ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవికి చార్జ్‌ మెమోలు ఇవ్వాలని ఐసీడీఎస్‌ పీడీ షాహిదాను కలెక్టర్‌ ఆదేశించారు.అంగన్‌వాడీ కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసి పిల్లల బరువులు పరీక్షించి సంబంధిత రిపోర్టుతోపాటు చార్జ్‌ మెమోలను తనకు అందించాలని పీడీకి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement