అనంతపురం అర్బన్: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు పదో తరగతిలో మంచి మార్కులతో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్పరెన్స్ హాలులో సంక్షేమ సెక్టార్‌పై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎంఈఓలు, ఎంపీడీఓలు సమన్వయంతో బడిబయట ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. కేజీబీవీల్లో 40 శాతం లోపు మార్కులు వచ్చిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఫేస్–2, నాడు–నేడు కార్యక్రమం కింద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆదర్శ ఎస్సీ కాలనీల్లో తాగునీరు, వీధిదీపాలు, మరుగుదొడ్ల సమస్య లేకుండా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


