డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలి | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలి

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

ఉరవకొండ: రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం అనంతపురంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలోని ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నీట్‌ పరీక్షలో అక్రమాలు, పేపర్‌ లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని గుర్తు చేసిన ఆయన, రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై అనేక ఆరోపణలు వచ్చినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హయాంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ బడులను నాడు–నేడు ద్వారా కార్పొరేట్‌ తరహలో తీర్చిదీద్ది, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ బోధన వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ విద్యకు కొత్త ఊపు తీసుకొచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంస్కరణలను కొనసాగించకుండా విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తోందన్నారు. సీబీఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. ప్రభుత్వం దీని పై స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులతో వైఎస్సార్‌సీపీ భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు.

నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement