బొమ్మనహాళ్: మండలంలోని లింగదహాళ్‌లో కుటుంబ కలహాలు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నాయి. ఎస్‌ఐ నబీరసూల్ తెలిపిన మేరకు...గ్రామానికి చెందిన అవిడప్ప (37) వసంతమ్మ దంపతులు. వీరికి అనుశ్రీ, చందన అనే ఇద్దరు కుమారైలు. అవిడప్ప మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఇటీవల భార్యతో గొడవ పడడంతో ఆమె కుమారైలను తీసుకొని పుట్టినింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన అడివప్ప ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న బొమ్మనహాళ్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్‌కు తరలించారు. మృతుడి తల్లి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
‘రైతులపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య ధోరణి’
అనంతపురం అర్బన్: జిల్లాలో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిందని మండిపడ్డారు. ఉపాధి కూలీల బకాయి బిల్లులు చెల్లించడంలోనూ నిర్ల్యమే అన్నారు. శుక్రవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో విలేకరులతో నల్లప్ప మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జిల్లాను తక్షణం కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశ ధోరణి
భావప్రకటన స్వేచ్ఛపై చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోంది..సోషల్‌మీడియా విమర్శకులపై కేసులు పెట్టడం, దాడులు చేయడం సరికాదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ విమర్శించారు. ఆయన శుక్రవారం స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.జాఫర్, జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి, నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రశ్న రావణ్ తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరిచినందుకు అతన్ని అరెస్టు చేసి వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమన్నారు. ఏకంగా ఉపా చట్టం కింద కేసు పెట్టడం ప్రభుత్వ కర్కశానికి నిదర్శనమ న్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పు డూ కొందరు ఆ ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతలను సోషల్ మీడియాలో దారుణంగా విమర్శించినా అప్పట్లో ఎవరిపైనా కేసులు పెట్టలేదు... వేధించలేదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. నగర కార్యదర్శి శ్రీరాములు, లింగమయ్య,తదితరులు పాల్గొన్నారు.


