కలల సౌథం.. నిర్మాణంలో నిర్లక్ష్యం
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వాసుల కలల సౌధం.. ఎందరికో పునర్జన్మను ప్రసాదించే జిల్లా సర్వజనాస్పత్రి సర్జికల్ బ్లాక్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. రూ.300 కోట్లతో సర్జికల్ బ్లాక్‌తో పాటు ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ పనుల కాంట్రాక్ట్‌ను మూడేళ్ల క్రితం (2023 ఫిబ్రవరిలో) హైదరాబాద్‌కు చెందిన మేఘ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. సాంకేతిక కారణాలతో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. రెండేళ్ల క్రితం వరకూ సర్జికల్ బ్లాక్ పనులు శరవేగంగా సాగుతూ వచ్చాయి. అదే స్థాయిలో పనులు కొనసాగి ఉంటే ఇప్పటికే నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చి ఉండేది.
నిరంతర పర్యవేక్షణలో..
సర్జికల్ బ్లాక్ నిర్మాణాన్ని ఏపీఎంఎస్‌ఐడీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంట్రాక్ట్ సంస్థను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈఈ జి.రామ్మోహన్ నేతత్వంలో డీఈ వై.నవీన్‌కుమార్, ఏఈ జె. రాఘవేంద్ర దగ్గరుండి పనులు సజావుగా సాగేలా చొరవ తీసుకున్నారు. వందకు పైగా కార్లు పట్టేలా సువిశాలమైన సెల్లార్ నిర్మాణంలో భారీ యంత్రాలను ఉపయోగించాల్సి వచ్చింది. ఈ క్రమంలో భూగర్భంలో ఉన్న భారీ బండ రాళ్లను పెకలించి పక్కన పెట్టడంతో ఆ ప్రాంతం ఓ కొండను తలపిస్తోంది. జీ ప్లస్ 6 భవనాలతో నిర్మాణ పనులు కొనసాగాయి. ఈ భవనం పూర్తయితే ఆర్థో, ఈఎన్‌టీ వార్డులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లాండ్రీ, సెంట్రల్ స్టోర్, టీచింగ్.. సెమినార్ గదులు, బ్లడ్ బ్యాంక్, ఆప్తమాలజీ ల్యాబ్‌లు, మైక్రోబయాలజీ ల్యాబ్‌లు, పాథాలజీ ల్యాబ్‌లు, లెక్చరర్ గదులు, అనస్థసీయా బ్లాక్, 20 పడకలతో కూడిన ఐసీయూ, ఫ్యాకల్టీ గదులు, 240 పడకల వార్డులు అందుబాటులోకి రానున్నాయి.
ఆగిన సర్వజనాస్పత్రి సర్జికల్ బ్లాక్ నిర్మాణ పనులు
కొనసాగుతున్న పనులు
సర్జికల్ బ్లాక్ పనులు ప్రస్తుతం మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ చేసిన పనులకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్ట్ సంస్థకు ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు సకాలంలో చెల్లిస్తూ వచ్చారు. అయినా అనుకున్న స్థాయిలో పనులు ఊపందుకోవడం లేదు. అయితే అమరావతి అభివద్ధి పేరుతో నిధులన్నీ రాజధాని ప్రాంతానికే చంద్రబాబు ప్రభుత్వం కేటాయిస్తుండడంతో సర్జికల్ బ్లాక్ నిర్మాణం నత్తనడకన సాగేందుకు కారణమని జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా ప్రయోజనం లేకుండా పోతోందని, ప్రజల కలల సౌధంగా ఉన్న సర్జికల్ బ్లాక్ నిర్మాణంపై ఇప్పటికై నా మంత్రి దష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
రెండేళ్ల క్రితం వరకూ శరవేగంగా సాగిన సర్జికల్ బ్లాక్ పనులు
రూ.300 కోట్లతో సర్జికల్, ఎంసీహెచ్ బ్లాక్‌ల నిర్మాణం
నిర్మాణం పూర్తయ్యే దశలో పనుల్లో జాప్యం


