గొడవలు.. గందరగోళం | - | Sakshi
Sakshi News home page

గొడవలు.. గందరగోళం

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: అనంతపురం న్యూటౌన్‌ జూనియర్‌ కళాశాలలో ఇటీవల ముగిసిన ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకన (స్పాట్‌ వాల్యుయేషన్‌) శిబిరంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలు అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. బోర్డు నుంచి సీనియార్టీ ఆధారంగా వచ్చిన చీఫ్‌ ఎగ్జామినర్ల (సీఈ) జాబితాలో మార్పులు చేయడం వివాదానికి దారితీసింది. సీనియర్‌ లెక్చరర్లను పక్కనబెట్టి జూనియర్లను నియమించడం, విధి విధానాలను ఉల్లంఘిస్తూ నియామకాల్లో ఇష్టానుసారం వ్యవహరించడం శిబిరంలో అసంతృప్తిని రగిల్చింది. దీనికి తోడు అధికారుల మధ్య సమన్వయం లోపించింది. ఈ క్రమంలో రగడ రాజుకుందని సీఈలు, ఏఈలు విమర్శిస్తున్నారు. గొడవలు, పరస్పర దూషణలు చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఒక జవాబు పత్రం మాయమై నాలుగు రోజుల తర్వాత క్యాంపు బయట లభించడం.

సీనియార్టీని అనుసరించి చీఫ్‌ ఎగ్జామినర్‌ (సీఈ)ల నియామకం ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారుల నుంచే జరుగుతుంది. ఈ క్రమంలో ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు సంబంధించి మొత్తం 12 మందితో సీనియార్టీ జాబితా పంపారు. దీన్నికాదని జిల్లాస్థాయిలో మరో జాబితా తయారు చేయడం.. అందులో సీనియార్టీని అనుసరించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బోర్డు నుంచి వచ్చిన జాబితాలో 5వ పేరులోఉన్న ప్రిన్సిపాల్‌..ఇక్కడి జాబితాలో 14వ పేరుగా మార్చడమే ఇందుకు నిదర్శనం. గణితం సబ్జెక్టులోనూ ఇదే రకంగా జరిగిందని అధ్యాపకులు చెబుతున్నారు.

క్యాంపులో ఓ జవాబుపత్రాన్ని ‘మాయ’ం చేశారు. ఈ విషయం గతనెల 31న వెలుగులోకి వచ్చింది. సంబంధిత ఏఈ, సీఈలకు ముచ్చెమటలు పట్టాయి. వారికి షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఈ దుమారం క్యాంపు మొత్తం వైరల్‌ కావడంతో పెద్ద చర్చ జరిగింది. ఈ ఘటన మూల్యాంకన ప్రక్రియ భద్రతపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ప్రక్రియలో ఇలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోవడం పట్ల విద్యావర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

క్యాంపులో మిస్‌ అయిన జవాబుపత్రం నాలుగు రోజుల తర్వాత అదికూడా క్యాంపునకు సంబంధం లేనిచోట లభించింది. దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న ఫిజిక్స్‌ ల్యాబ్‌లో దొరకడం అనుమానాలకు తావిస్తోంది. క్యాంపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యం ప్రధానగేటుకు తాళం వేసే ఉంటుంది. బయట వారికి అనుమతి ఉండదు. అలాగే ఫిజిక్స్‌ ల్యాబ్‌కు తాళం వేసే ఉంటుంది. అధికారులు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే శిబిరం నుంచి మాయమైన జవాబుపత్రం.. తాళం వేసి ఉండే ల్యాబ్‌లో ఎలా దొరికిందనేది అంతుచిక్కని ప్రశ్న. దీని వెనుక దాగి ఉన్న కుట్రకోణం బయటకు రావాలని ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు డిమాండ్‌ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తే ఇంటిదొంగలు బయటపడతారని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సీఈలు, ఏఈలు మూల్యాంకన విధులంటేనే బెంబెలేత్తే పరిస్థితి వస్తుందని వారు వాపోతున్నారు.

స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో జరిగిన అవకతవకలపై స్వయంగా కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (సీఓఈ)కు ఓ అసిస్టెంట్‌ క్యాంపు అధికారి (జనరల్‌) ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. అనవసరమైన వాగ్వాదాలతో తొలిరోజు శిబిరం బాగా ఆలస్యమైందని, ఏసీఓ (జనరల్‌)ను పక్కనపెట్టి అన్నీతానై క్యాంపు అధికారి వ్యవహరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా అప్పటికే పని చేసిన వ్యక్తిని మళ్లీ సీఈగా నియమించారని తెలిపారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో కూడా ఏసీఓ జనరల్‌–1ను చేర్చకపోవడం, అవసరమైన సమాచారం అందించకపోవడం ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్యలేనని పేర్కొన్నారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఇంటర్‌ బోర్డు అధికారులు ఈ వ్యవహారాన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకుంటారో వేచి చూడాలి.

ఇదీ ఇంటర్‌ ‘స్పాట్‌’ తీరు

బోర్డు నుంచి వచ్చిన సీఈల జాబితా మార్పుతో దుమారం

సీనియర్‌గా ఉన్నవారిని తప్పించి

జూనియర్‌ల నియామకం

మూల్యాంకన శిబిరంలో గొడవలు, ఘర్షణలు, పరస్పర దూషణలు

ఓ జవాబుపత్రం ‘మాయ’ం...

నాలుగు రోజుల తర్వాత లభ్యం

ఇటీవల ముగిసిన మూల్యాంకనం... ఆలస్యంగా వెలుగులోకి అక్రమాలు

జవాబుపత్రాన్ని ‘మాయ’ం చేశారు?

సీఓఈకు ఫిర్యాదు చేసిన ఏసీఓ..

నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..

బోర్డు జాబితాలో 5వ పేరు..

ఇక్కడి జాబితాలో 14వ పేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement