కాసుల రెవెన్యూ | - | Sakshi
Sakshi News home page

కాసుల రెవెన్యూ

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

● ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గుడిబండ తహసీల్దారు కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గత నెల 31న దాడులు నిర్వహించారు. మ్యుటేషన్‌ కోసం ఎస్‌.రాయాపురం రైతు షేక్‌ సద్ధాం నుంచి తహసీల్దారు శ్రీధర్‌ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇది ఒక ఎత్తయితే.. ఆ తరువాత విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అనంతపురం శివారు పంగలరోడ్డు దగ్గరున్న వీరనాగమ్మ గుడి సమీపంలోని శ్రీధర్‌ ఇంటిని ఏసీబీ అధికారులు తనిఖీ (హౌస్‌ సెర్చ్‌) చేయగా రూ.50 లక్షల నగదు దొరికింది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

● అనంతపురం రూరల్‌ మండలం ఇటుకలపల్లికి చెందిన బొజ్జయ్యకు 376 సర్వే నంబరులో పొలం ఉంది. డబుల్‌ ఎంట్రీగా ఉన్న తప్పును సరిచేసేందుకు మ్యుటేషన్‌ కోసం వీఆర్‌ఓ రూ.30 వేలు అడిగారు. దీంతో నగదు రూపంలో రూ.5 వేలు ఇచ్చి, వీఆర్‌ఓ చెప్పిన బినామీకి ఫోన్‌పే ద్వారా రూ.14 వేలు పంపించి ఇంత కంటే ఎక్కువ ఇచ్చుకోలేనని బొజ్జయ్య చెప్పాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని మ్యుటేషన్‌ చేయకపోవడంతో గత డిసెంబరు 8వ తేదీన బొజ్జయ్య ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశాడు.

అనంతపురం అర్బన్‌: ప్రభుత్వ యంత్రాంగంలో రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైనది. ఇక్కడ పారదర్శకంగా సేవలందించాల్సిన అధికారులు, ఉద్యోగుల్లో కొందరు దారితప్పారు. అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రధానంగా మ్యుటేషన్లలో అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కొర్రీలు వేసి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటుండటంతో రైతులు చేసేది లేక ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ ఇలాంటి దుస్థితే నెలకొంది. అయితే యల్లనూరు, కుందుర్పి, రాప్తాడు, గుత్తి తహసీల్దారు కార్యాలయ అధికారులు, సిబ్బంది అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ముడుపులు ఇస్తేనే...

రెవెన్యూ సేవలను అధికారులు ఆదాయ వనరులుగా మార్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. మ్యుటేషన్‌ కోసం వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. చుక్కల భూముల ఫైళ్లు సిద్ధం చేసేందుకు, పట్టాదారు పాసుపుస్తకాల జారీకి, అడంగళ్‌, 1బీ సవరణకు కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అడ్డూఅదుపు లేకుండా మామూళ్లు గుంజుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అన్నీ సక్రమంగా ఉన్నా పనులు చేయడానికి అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్‌ చేస్తుండటంతో విసిగిపోయిన బాధిత రైతులు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నారు.

కరెక్షన్‌.. కలెక్షన్‌..

తహసీల్దారు కార్యాలయ పరిధిలోని కొందరు అవినీతి సిబ్బంది రికార్డుల్లో చేతివాటం చూపిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో వివరాలను వారే తప్పుగా నమోదు చేస్తారు. ఆ తప్పును సరిచేసేందుకు సంబంధిత వ్యక్తుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తుంటారు. సరిదిద్ధాలంటే (కరెక్షన్‌)పై అధికారులకు డబ్బులు ఇచ్చుకోవాలంటూ వేలకు వేల రూపాయలు గుంజుతుంటారు.

డబ్బులివ్వకపోతే చుక్కలే..

రెవెన్యూ సిబ్బంది రూటే సప‘రేటు’గా ఉంటోంది. పనిమీద వచ్చిన వారు డబ్బులు ఇవ్వకపోతే చుక్కలు చూపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఫైలులో ఏదో ఒక కొర్రీ పెట్టి నెలల తరపడి తిప్పుకుంటారని పలువురు బాధితులు వాపోతున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో వారు అడిగినంత కాకపోయినా మధ్యేమార్గంగా ఒక ‘రేటు’ మాట్లాడుకుని మర్పించుకోవాల్సి వస్తోందని అంటున్నారు.

అవినీతికి అడ్డాగా

తహసీల్దార్‌ కార్యాలయాలు

భూ సమస్యలు, మ్యుటేషన్లే

ఆదాయ వనరులు

అడిగినంత ఇవ్వకపోతే

ముందుకు సాగని పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement