అనంతపురం టౌన్: అద్దె భవనం ఖాళీ చేయించే విషయంలో కోర్టు అక్షింతలు ఓ వైపు.. మరొకచోటకు పోరాదంటూ ప్రజాప్రతినిధి హూంకరింపు మరొక వైపు స్టాంప్స్ అండ్ రిజి స్ట్రేషన్స్ శాఖ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అనంతపురం రామ్‌నగర్‌లోని అద్దె భవనాల్లో జిల్లా రిజిస్ట్రార్ (డీఆర్) కార్యాలయంతో పాటు అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. అయితే సంబంధిత భవన యజమాని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు కూడా నిర్ణీత గడువులోపు ఖాళీ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గడువుదాటినా ఖాళీ చేయకపోవడంతో భవన యజమాని మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ కిందకు రావడంతో అప్పటి జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ కోర్టుకు హాజరై మరికొంత గడువు కోరారు. అనంతరం కార్యాలయ మార్పు కోసం అద్దె భవనం కావాలని ప్రకటనలు ఇచ్చారు. బళ్లారి రోడ్డులోని ఓ భవన యజమాని ముందుకు రావడంతో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు అధికారులు కార్యాలయాన్ని సదరు భవనంలోకి మార్చడానికి కసరత్తు పూర్తి చేశారు. ఇంతలో డాక్యుమెంట్ రైటర్లు స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగేలా చూడాలని మొరపెట్టుకున్నారు. ఈ మేరకు రామ్ నగర్ ప్రాంతం నుంచి మరొక చోటుకు మారకూడదంటూ ప్రజాప్రతినిధి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ భవనం కోసం అన్వేషించారు. అయితే రామ్‌నగర్‌లో అద్దె భవనం దొరకలేదు. కోర్టు ఆదేశాలు ధిక్కరించలేక.. ప్రజాప్రతినిధి మాటను కాదని ముందుకెళ్లలేక మదనపడుతున్నారు. భవనాన్ని మీరే అద్దెకు ఇప్పించండని కోరితే ప్రజాప్రతినిధి ‘ఏమి చేసుకుంటారో నాకు తెలీదు. కార్యాలయం ఇదే ప్రాంతంలో ఉండాల్సిందే’ అంటూ మరోమారు గద్దించారని సమాచారం.
ఎవ్వరూ ఒత్తిడి చేయలేదు
రామ్‌నగర్‌లోని అద్దెభవనంలో ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాన్ని మార్చాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవమే. అందులో భాగంగానే భవనం కోసం వెతికాం. బళ్లారి రోడ్డులో భవనం ఎంపిక చేశాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ సెలవులో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత కార్యాలయం మార్పుపై నిర్ణయం తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మార్చకూడదని.. ఇక్కడే ఉంచాలని ఏ ప్రజాప్రతినిధీ మమ్మల్ని ఒత్తిడి చేయలేదు. – బి.శ్రీనివాసులు, జిల్లా రిజిస్ట్రార్,
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనం ఖాళీకి కోర్టు ఆదేశం
స్థానికంగా ఉండాలంటున్న
అర్బన్ ప్రజాప్రతినిధి
సమీపంలో దొరక్క..
ఉన్న భవనం ఖాళీ చేయలేక..
సందిగ్ధంలో స్టాంప్స్ అండ్
రిజిస్ట్రేషన్ అధికారులు


