నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌ రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యల అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలని సూచించారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని తెలియజేశారు.

సజావుగా ఫ్లాగ్‌షిప్‌ పరీక్ష

అనంతపురం అర్బన్‌: యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో నిర్వహించిన ఫ్లాగ్‌షిప్‌ (ఎన్‌డీఏ, ఎన్‌ఏ, సీడీఏ) పరీక్ష సజావుగా జరిగింది. పరీక్షలకు 522 మంది అభ్యర్థులకు గానూ 340 మంది హాజరయ్యారు. ఎస్‌ఎస్‌బీఎన్‌ కేంద్రంలో జరిగిన కంబైన్డ్‌ డిఫెన్స్‌ అకాడమీ (సీడీఏ) పరీక్షకు అభ్యర్థుల హాజరు 55 శాతం నమోదయ్యింది. కేఎస్‌ఆర్‌ కళాశాల కేంద్రంలో జరిగిన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ), నావల్‌ అకాడమీ (ఎన్‌ఏ) పరీక్షకు అభ్యర్థుల హాజరు 65.18 శాతం నమోదయ్యింది. పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ ఆనంద్‌ సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును, మౌలిక సదుపాయాల కల్పనను పరిశీలించారు.

నేడు డయల్‌ యువర్‌

ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్‌ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు సెల్‌: 8977716661 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్‌ చేసే వినియోగదారులు తమ విద్యుత్‌ నంబర్‌ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు.

జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ..

జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు ఫోన్‌ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

వడదెబ్బతో వృద్ధురాలి మృతి

కూడేరు: భగభగమని మండుతున్న ఎండలకు ఓ వృద్ధురాలు వడదెబ్బకు గురై మృతి చెందింది. గార్లదిన్నె మండలం సంజీవపురానికి చెందిన బొగ్గు వెంకటలక్ష్మమ్మ (65) ఆదివారం కూడేరులో పోలీసు స్టేషన్‌ వెనుక వైపు వ్యవసాయ పొలంలో విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆ పొలం రైతు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. ఆమె వద్ద లభించిన కవర్లో ఆస్పత్రి చీటీ కనిపించింది. అందులో ఉన్న చిరునామా ఆధారంగా కుమారుడు సోముకు సమాచారమిచ్చారు. అతను వచ్చి చనిపోయినది తన తల్లి వెంకటలక్ష్మమ్మ అని గుర్తించాడు. తన తల్లి పుట్టినిల్లు అరవకూరని, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇంటి వద్ద ఉండకుండా తిరుగుతుండేదని చెప్పాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలిపాడు. ఈ క్రమంలో శనివారం ఆమె వడదెబ్బకు గురై మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతిపై ఎలాంటి అనుమానాలూ లేవని చెప్పడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement