● కడప సెంట్రల్ జైలుకు తరలింపు
కదిరి టౌన్/తనకల్లు: రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన 43 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్ రాష్ట్ర దొంగపై పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు తెలిపారు. తనకల్లు మండలం నందిగానిపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి సాయికుమార్ అలియాస్ సాయి నితిన్ చోరీల్లో సిద్ధహస్తుడు. పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు పంపినా...తిరిగి వచ్చాక మళ్లీ చోరీల బాట పట్టేవాడు. ఇలా అతనిపై తిరుపతి, తిరుమల, అలిపిరి, తిరుచానూర్, రేణిగుంట, అన్నమయ్య జిల్లా మదనపల్లి, అనంతపురం, నార్పల, కర్నూలు, హిందూపురం, తనకల్లు పోలీసు స్టేషన్లతో పాటు కర్ణాటక, తమిళనాడులోని వివిధ పోలీసు స్టేషన్లలో 43 చోరీ కేసులు నమోదై ఉన్నాయి. దీంతో కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు సాయికుమార్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. గతంలోనే కదిరి పోలీసు సబ్‌డివిజన్ పరిధిలోని ముగ్గురిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు గుర్తు చేశారు. వివిధ కేసుల్లో నేరస్తులు, రౌడీషీటర్లుగా ఉన్న వారు ప్రవర్తన మార్చుకోకపోతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఒక్క అంశంతోనే ముగిసిన పాలకమండలి సమావేశం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం ఒకే ఒక్క అంశంతోనే ముగిసింది. వీసీ ప్రొఫెసర్ ఎన్‌వీఆర్ జ్యోతి కుమార్ అధ్యక్షతన శనివారం ఎస్కేయూ పాలకమండలి సమావేశం జరిగింది. పాలకమండలి సభ్యులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. 2023లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. హైకోర్టులో వ్యాజ్యం కారణంగా భర్తీకి అవరోధాలు ఏర్పడ్డాయి. తిరిగి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధం చేసిన నేపథ్యంలో అప్పటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలనే ప్రతిపాదనను పాలక మండలి ఎజెండాలో చేర్చారు. దీనికి పాలకమండలి ఆమోదం తెలిపింది.
డీఎస్పీ విజయ్‌కుమార్‌పై బదిలీ వేటు
పుట్టపర్తి టౌన్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్‌పై బదిలీ వేటు పడింది. రాష్ట్రంలోని ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి డీఐజీ హరీష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్‌ను శ్రీకాకుళం జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బదిలీ చేశారు. అయితే పుట్టపర్తి డీఎస్పీగా ఎవరినీ నియమించలేదు. 17 నెలలుగా విజయకుమార్ పుట్టపర్తి డీఎస్పీగా పనిచేశారు. పలు అంశాల్లో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. విదేశీయుల భూముల అంశం, కొత్తచెరువు హత్యకేసు, పేకాట అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు.


