రైతులను మరచిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

రైతులను మరచిన ప్రభుత్వం

Apr 12 2026 3:00 AM | Updated on Apr 12 2026 3:00 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: పది మందికి అన్నం పెడుతున్న రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం మరచిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం అనంతపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి పేరిట రూ.లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్‌ వేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆర్గనైజ్డ్‌గా జరుగుతున్న క్రైమ్‌ను ప్రజల ముందు ఉంచుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ట్రోలింగ్‌ చేయడం శోచనీయమన్నారు. డైవర్షన్‌ టెక్నిక్‌లను ఉపయోగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఛీప్‌ పాల్‌టిక్స్‌కు పాల్పడుతోందన్నారు. అమరావతి నిర్మించడానికి తాము వ్యతిరేకం కాదని, అక్కడ చేస్తున్న దోపిడీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు. కేంద్రీకృత అభివృద్ధి విధానానికి తాము వ్యతిరేకమన్నారు. జగనన్న చెప్పినట్లు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుకుని రాజధాని (మావిగన్‌) అభివృద్ధి చేస్తే అతితక్కువ ఖర్చుతోనే పూర్తవుతుందన్నారు. 28 గ్రామాలున్న అమరావతి ప్రాంతంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని, రెండోదశ భూసేకరణకు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ఇందుకోసం ఇంకో రూ.లక్ష కోట్లు అప్పులు చేస్తామనడం శోచనీయమన్నారు. మీరు, మీ బినామీలు భూములు కొనుగోలు చేసిన ప్రాంతానికి రాష్ట్ర సంపదనంతా ఎలా తరలిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు.

సీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వండి

అమరావతికి ఇచ్చిన ప్రాధాన్యతను రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి ఇవ్వాలని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లాలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే హంద్రీ–నీవా, హెచ్‌ఎల్‌సీ మోడరైజేషన్‌ పూర్తవుతాయన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే పోలవరం డైవర్షన్‌ వల్ల ఏపీ, ఎగువ ప్రాంతాలకు కేటాయింపునకు అవకాశం ఉన్న 45 టీఎంసీల నీటిని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు కేటాయించాలన్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా ఎమ్మెల్యే పరిటాల సునీత అడ్డుకుంటోందని విమర్శించారు. డ్యాంలో నీరు లేక బోర్లు ఎండిపోతున్నాయన్నారు. జీడిపల్లి నుంచి పేరూరు డ్యాంకు నీళ్లు తెస్తామని చెబుతున్న పరిటాల సునీత భూ సేకరణకు ఒక రూపాయి కూడా ఇప్పించలేదన్నారు. శిలాఫలకం వేసుకుని డబ్బా కొట్టుకోవడం మినహా చేసిందేమీ లేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 60 శాతం పనులు పూర్తి చేయించానన్నారు. రూ.170 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. పనులు పూర్తయి డ్యాంకు నీళ్లు తీసుకొస్తే ప్రకాష్‌రెడ్డికి మంచిపేరు వస్తుందని భయపడి అప్పటి కాంట్రాక్టర్‌ను బెదిరించి పనులు ఆపించారన్నారు. ప్రత్యామ్నాయంగా తురకాలపట్నం చెరువు మీదుగా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావచ్చని చెప్పామన్నారు. అయినా ఆమె పట్టించుకోలేదన్నారు. పేరూరు డ్యాంకు నీటి విడుదల కోసం ఈ నెల 21న కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు ప్రకాష్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రంగంపేట గోపాల్‌రెడ్డి, గంగుల సుధీర్‌రెడ్డి, బద్దలాపురం పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్‌, మారుతి, రాప్తాడు వైస్‌ ఎంపీపీ బోయ రామాంజనేయులు, మీనుగ నాగరాజు పాల్గొన్నారు.

అమరావతి పేరిట రూ.లక్షల కోట్ల దోపిడీకి స్కెచ్‌

ఛీప్‌ పాలిటిక్స్‌ చేస్తున్న చంద్రబాబు

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement