అనధికారిక పనులే ఎక్కువ! | - | Sakshi
Sakshi News home page

అనధికారిక పనులే ఎక్కువ!

Mar 14 2026 7:44 AM | Updated on Mar 14 2026 7:44 AM

సమగ్రశిక్ష సెక్టోరియల్స్‌ పనితీరుపై విమర్శలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని పాఠశాలల్లో విద్యాభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ బోధన ప్రమాణాలను మెరుగుపరచాల్సిన బాధ్యతను సమగ్ర శిక్ష సెక్టోరియల్‌ అధికారులు విస్మరించారు. అధికారిక బాధ్యతలను పక్కనపెట్టి అనధికారిక పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమయ్యాయి. పాఠశాలల పర్యవేక్షణ, ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం, విద్యార్థుల అభ్యసన స్థాయిలపై సమీక్ష వంటి కీలక అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సొంత పనులకే ప్రాధాన్యత

సమగ్రశిక్షలో ఏఎంఓ వేణుగోపాల్‌, అసిస్టెంట్‌ ఏఎంఓ ఫణిరాజ్‌, అసిస్టెంట్‌ ఏఎంఓ (కన్నడ) నారాయణస్వామి, జీసీడీఓ కవిత, అసిస్టెంట్‌ సీఎంఓ చంద్రశేఖర్‌, ఏపీఓ నారాయణస్వామి, అసిస్టెంట్‌ అలెస్కో రామచంద్ర పని చేస్తున్నారు. విధుల్లో భాగంగా వీరు తరచూ పాఠశాలలను సందర్శిస్తూ బోధన విధానాలను పరిశీలించాలి. అలాగే ప్రభుత్వ విద్యా పథకాల అమలును పర్యవేక్షించాలి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో చదవడం, గణిత నైపుణ్యాలను పెంపొందించడం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జీఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం పూర్తిగా పర్యవేక్షణ బాధ్యత సమగ్ర శిక్ష అధికారులదే. ఇంతటి కీలకమైన జీఎఫ్‌ఎల్‌ఎన్‌ సైతం సెక్టోరియల్‌ అధికారులు గాలికొదిలేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలులోనూ పట్టనట్టు వ్యవహరించారని సమాచారం. కార్యాలయానికి సంబంధించిన పనుల కంటే వ్యక్తిగత పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సెక్టోరియల్‌ అధికారులు బిల్లులకు ఇచ్చే ప్రాధాన్యత పర్యవేక్షణకు ఇవ్వడం లేదనే పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టెంటేటివ్‌ ఇవ్వరు...టూర్‌ డైరీ ఉండదు

సాధారణంగా సెక్టోరియల్‌ అధికారులు నెల ప్రారంభంలోనే ఎక్కడికెక్కడ వెళుతున్నారనే అంశాలపై టెంటేటివ్‌ రిపోర్ట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. నెల పూర్తయిన తర్వాత టూర్‌ డైరీ నివేదించాలి. దీని ఆధారంగానే సంబంధిత కారుకు బిల్లు పెట్టాలి. ఇక్కడ మూడు కార్లు ఏడుగురు సెక్టోరియల్స్‌ ఉన్నారు. ఎవరు ఎక్కడికి పోతున్నారో ఎవరికీ తెలీదు. వీరు విధుల్లో చేరినప్పటి నుంచి టెంటేటివ్‌ ఇవ్వలేదు. టూర్‌ డైరీ పెట్టలేదు. కన్నడ ఏఎంఓ నారాయణస్వామి రోజూ కార్యాలయానికి రావడం వెళ్లడం తప్పితే ఎలాంటి పని చేయడం లేదనే విమర్శలున్నాయి. మధ్యాహ్నం దాటితే కార్యాలయంలో కనిపించరని ఎక్కడికి పోతున్నాడో ఆయనకు తప్ప ఇతరులకెవరికీ తెలయదని ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సెక్టోరియల్‌ అధికారులను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు కోరుతున్నారు. లేదంటే జిల్లాలో విద్యాభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రశ్నార్థకంగా మారతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement