తాడిమర్రి: మండలంలోని మద్దులచెర్వు గ్రామంలో రైతు ఉప్పులూరు నాగార్జునరెడ్డికి చెందిన అరటి తోట శుక్రవారం అగ్నికి ఆహుతైంది. దీంతో సుమారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లింది. బాధిత రైతు వివరాల మేరకు.. రైతు ఉప్పలూరు నాగార్జునరెడ్డి తనకున్న రెండున్నర ఎకరాల్లో రెండేళ్ల క్రితం 4,000 అరటి మొక్కలు నాటి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం రెండో కొయ్య పంటతో తోట గెలలతో కళకళ లాడుతోంది. మరో నెల రోజుల్లో పంటకోత కోయాల్సి ఉంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆకతాయిలు బీడీ, సిగరెట్ తాగి పడేయటంతో తోటకు నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న రైతు కుటుంబ సభ్యులు వెళ్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అరటి చెట్లు, తోటలో ఏర్పాటు చేసిన డ్రిప్పు, పైపులు కాలిపోయాయి. వేసవి కాలం కావడంతో ఎండలు అధికమై మంటలను ఆర్పలేక పోయారని వాపోయారు. సుమారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. +ఞ?ష్ళఔ్ఛుఽౌఠిౌ


