మోక్ష మార్గం.. శివనామ స్మరణం
భగవంతుడు సర్వవ్యాపకుడు. సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒక్కటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు ఉండవు. ఈ సత్య విషయాన్ని తెలియ జెప్పే నిర్గుణ పరతత్వ స్వరూపమే ‘లింగం’. ఈ లింగోద్భవ వేళ శివనామస్మరణ మోక్ష మార్గానికి మార్గమని పెద్దలు చెబుతుంటారు. ఆ సమయంలో రానే వస్తోంది. మహాశివరాత్రి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి.
తాడిమర్రి/ఎన్‌పీ కుంట: కాకిముట్టని తీర్థంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన తాడిమర్రి మండలం చిల్లవారిపల్లిలో వెలసిన కాటికోటేశ్వర క్షేత్రం అత్యంత మహిమాన్వితమైన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ వెలసిన స్వామి.. కొలిచిన వారికి కొంగు బంగారమై ఉంటాడని భక్తుల నమ్మకం. రెండు కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన ఈ క్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాశీ నుంచి తెప్పించి ప్రతిష్టించిన శివలింగం, నవగ్రహాలు, గదాగుండం, కొండపై గుహలో అక్కమ్మ దేవతలు ప్రత్యేకతను చాటుతున్నాయి. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి పర్వదినాన రెండు రోజుల పాటు జాతర నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రానికి అనంతపురం నుంచి నార్పల మీదుగా పార్నపల్లి బస్సులో వెళ్లవచ్చు. అలాగే ధర్మవరం నుంచి పులివెందుల బస్సులో దాడితోట మీదుగా క్షేత్రానికి చేరుకోవచ్చు.
కాకి ముట్టని తీర్థం
కాటికోటేశ్వర క్షేత్రంలో కాకులు మచ్చుకై నా కనిపించవు. అందుకే ఈ కోనేటిలోని నీటిని కాకిముట్టని తీర్థమని అంటారు. పూర్వం ఇక్కడి గుహలో వెలసిన అక్కమ్మ దేవతలు కోనేటిలో జలకాలు ఆడేవారని, ఆ సమయంలో వారి వస్త్రాలపై కాకులు రెట్ట వేయడంతో వారు ఆ ప్రాంతంలో కాకులు ఉండకుండా శాసించినట్లుగా ఓ పూర్వగాథ ఉంది.
14 నుంచి జాగరణ మహోత్సవాలు
ఎన్‌పీకుంట మండలం గూటిబైలులో వెలసిన తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు జరిగే తిమ్మమాంబ జాగరణ మహోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ వెలసిన తిమ్మమ్మ మర్రిమాను 8.15 ఎకరాల్లో విస్తరించి, 6,800 ఊడలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది.
మహావృక్షం వెనుక పురాణగాథ ఉంది
బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబకు దిగువ గూటిబైలు గ్రామానికి చెందిన బాలవీరయ్యతో వివాహమైంది. కొన్నాళ్లపాటు వీరి జీవితం ఆనందంగా సాగింది. ఈ క్రమంలోనే అనారోగ్యం బారిన పడిన బాలవీరయ్య మృతి చెందడంతో ఆ రోజుల్లో కొనసాగుతున్న ఆచారం మేరకు తిమ్మమాంబ సతీసహగమనానికి సిద్ధం కాగా, చితి పక్కకు వైదొలగకుండా నాలుగు వైపులా ఎండిన మర్రి గుంజలను నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి నేడు మహావృక్షంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.
ఆలయ నిర్మాణంతో నిత్య పూజలు
బెంగుళూరుకు చెందిన కై వారం యోగినారాయణస్వామి ట్రస్ట్ ధర్మాధికారి డాక్టర్ ఎంఎస్ జయరాం 2011లో తిమ్మమ్మ మర్రిమాను వద్ద తిమ్మమాంబ, బాలవీరయ్య దంపతుల ఆలయంతో పాటు తిమ్మమాంబ సతీసహగమనం చేసిన ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ ఘాట్‌ను నిర్మించారు. ఈ సారి జాగరణ మహోత్సవాలను ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. తిమ్మమ్మ మర్రిమానుకు అరకిలోమీటరు దూరంలో శివప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో ధ్యానం చేసుకునేందుకు వీలుగా గదులు కూడా నిర్మించారు.
ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న కాటికోటేశ్వరస్వామి
తిమ్మమ్మ మర్రిమాను వద్ద వెలసిన తిమ్మమాంబ అమ్మవారు
శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న శైవ క్షేత్రాలు
కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కాటికోటేశ్వరుడు
ప్రాతివత్య మహిమకు ప్రతీకగా నిలిచిన తిమ్మమాంబ క్షేత్రం
మోక్ష మార్గం.. శివనామ స్మరణం


