ఆర్డీటీ నాశనానికి టీడీపీ నేతలే కారణం | - | Sakshi
Sakshi News home page

ఆర్డీటీ నాశనానికి టీడీపీ నేతలే కారణం

Feb 11 2026 7:31 AM | Updated on Feb 11 2026 7:31 AM

ఆర్డీటీ నాశనానికి టీడీపీ నేతలే కారణం

ఆర్డీటీ నాశనానికి టీడీపీ నేతలే కారణం

కళ్యాణదుర్గం: ఉమ్మడి జిల్లాలో ఆర్డీటీ సేవలు అంతరించిపోయేందుకు టీడీపీ నాయకులే కారణమయ్యారని వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్‌ తలారి రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం ఓ టీవీ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ... ఆర్డీటీకి 2025 ఏప్రిల్‌ నుంచి ఎఫ్‌సీఆర్‌ఏ (ఫారిన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌) రెన్యువల్‌ కాలేదన్నారు. దీంతో సేవా కార్యక్రమాలకు నిధులు అందకుండా పోయాయన్నారు. అంతేకాక సంస్థ ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంతో ఆర్డీటీపై ఉద్దేశపూర్వకంగానే కుట్ర జరిగినట్లుగా అర్థమవుతోందన్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్దరించాలని తాను కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే రాజకీయ ఉనికి కోసమేనంటూ కళ్యాణదుర్గం, రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజలను పెడదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అసలు ఆర్డీటీ పుట్టిందే కళ్యాణదుర్గం ప్రాంతం బెళుగుప్ప మండలంలోనన్నారు. అక్కడి నుంచే తాను పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. తాను బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు నాలుగు రోజుల్లో ఎఫ్‌సీఆర్‌ఏ తెస్తామని టీడీపీ నాయకులు పేర్కొన్నారని, అయితే నేటికీ ఇది సాధ్యం కాలేదని తెలిపారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాలతో ఆ రోజుల్లో పాదయాత్ర సాగనివ్వకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారని గుర్తు చేశారు. నిధులు అందకపోవడంతో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంస్థ... సేవా కార్యక్రమాలను కొనసాగించే క్రమంలో ఆస్తుల విక్రయానికి సిద్ధమవుతోందని, ఇది కూడా కళ్యాణదుర్గం నుంచే ప్రారంభం కావడం బాధాకరమన్నారు. బెళుగుప్ప, కొత్తూరు, బోయలపల్లి, మల్లికార్జున పల్లి, కై రేవు తదితర ప్రాంతాల్లోని దాదాపు 8కి పైగా స్థిరాస్తులు అమ్ముకోవాల్సిన దుర్గతికి సంస్థను నెట్టేశారని మండిపడ్డారు. ఆర్డీటీ ఆస్తులు అమ్ముతున్నారంటే సంస్థ మూసివేతకు సంకేతంగా భావించాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రజలు చైతన్యం కాకపోతే రానున్న రోజుల్లో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి ఉంటుందన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లోనైనా ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

తలారి రంగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement