బాబులో రాజకీయ అభద్రతాభావం | - | Sakshi
Sakshi News home page

బాబులో రాజకీయ అభద్రతాభావం

Feb 11 2026 7:30 AM | Updated on Feb 11 2026 7:30 AM

బాబులో రాజకీయ అభద్రతాభావం

బాబులో రాజకీయ అభద్రతాభావం

అనంతపురం: సీనియర్‌ రాజకీయ నాయకుడిగా చెప్పుకొనే చంద్రబాబునాయుడు తొలిసారి రాజకీయ అభద్రతాభావంలో మునిగిపోయారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయ్యిందంటూ చేసిన దుష్ప్రచారం సీబీఐ– సిట్‌ నివేదిక కొట్టిపారేసిందని, దీంతో ఏమి చేయాలో ఆయనకు దిక్కుతోచడం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని తప్పుబట్టారు. మంగళవారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇప్పటివరకు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని, అయితే ఎన్నడూ లేని విధంగా తొలిసారి రాజకీయంగా అభద్రతా భావంలో పడిపోయారని విమర్శించారు. తనపై తనకే నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఎన్నికల హామీలు అరకొరగా అమలు చేశారన్నారు. ఓసారి కల్తీ మద్యం అంటూ హడావుడి చేస్తారని, మరోసారి వివేకానందరెడ్డి హత్య కేసులో అబద్ధాలు ప్రచారం చేస్తారని, ఇంకోసారి శ్రీవారి లడ్డూ కల్తీ అంటూ దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌, టీడీపీ నేతలు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందని అసత్య ప్రచారం చేశారన్నారు. వాస్తవానికి చంద్రబాబు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తమ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రమణ్యం అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్‌ ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. చివరకు లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో ఎటువంటి జంతు కొవ్వూ కలవలేదని ఎన్‌డీఆర్‌ఏ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు తేల్చినా ఇంకా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు దుష్ప్రచారాలు ఆపడం లేదన్నారు. చంద్రబాబు చెప్పిందే సీబీఐ నివేదికలో రావాలన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం విచారకరమన్నారు.

తప్పు ఒప్పుకో...చంద్రబాబూ..!

‘ఎన్నికల సమయంలో మహిళలకు నెల నెలా రూ.1500 ఇస్తామన్నారు.. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎవరైనా ఈ హామీల గురించి అడిగితే ఉండండయ్యా లడ్డూలో కల్తీ జరిగింది’ అంటూ డైవర్ట్‌ చేసే పరిస్థితికి వచ్చారని చంద్రబాబుపై అనంత మండిపడ్డారు. చివరకు కేబినెట్‌ సమావేశాల్లోనూ ఇదే చర్చలు చేస్తున్నారని, చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందన్నారు. నిద్రలో కూడా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు మాజీ సీఎం జగన్‌ను కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన సొంత మామ ఎన్టీఆర్‌, ఆ తర్వాత హరికృష్ణపై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసి లబ్ధి పొందిన విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయాల్లో తనకు ఎవరు అడ్డువచ్చినా వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. అలానే ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా ఏదో ఒక మరక అంటించాలనే ఆరాటం తప్ప మరొకటి లేదన్నారు. ఇప్పటికై నా చేసిన తప్పులను చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

మీ హయాంలో ఉన్న కాంట్రాక్ట్‌ సంస్థే కదా?

‘తక్కువ ధరకు నెయ్యి వస్తుందా? అని అంటున్నారు. చంద్రబాబు కూడా వ్యాపారంలో ఉన్నాడు. డెయిరీలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో తక్కువ ధరకే నెయ్యి కొనుగోలు చేయలేదా?’ అని అనంత ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో సరఫరా జరిగి తిరస్కరించిన ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిళ్ల మీదే ప్రస్తుతం కేసు నడుస్తోందన్నారు. మీ హయాంలోనే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ నుంచే రూ.320, రూ.321కి సరఫరా జరిగింది వాస్తవం కాదా? అని నిలదీశారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, క్రిస్టియన్‌ మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, సాకే కుళ్లాయిస్వామి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో వ్యాఖ్యలేంటి?

పాలనా వైఫల్యం, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement