వక్ఫ్‌ భూముల సేకరణ నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ భూముల సేకరణ నిలిపివేయాలి

Feb 11 2026 7:31 AM | Updated on Feb 11 2026 7:31 AM

వక్ఫ్‌ భూముల సేకరణ నిలిపివేయాలి

వక్ఫ్‌ భూముల సేకరణ నిలిపివేయాలి

అనంతపురం అర్బన్‌: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఉన్న 71.57 ఎకరాల వక్ఫ్‌ భూముల సేకరణను తక్షణమే నిలిపివేయాలని, ఇందుకు జారీ చేసిన నోటిఫికేషన్‌ రద్దు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ ఆనంద్‌ను మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో మైనారిటీ నాయకులతో కలసి వినతి పత్రం అందజేసి, తమ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరి మండలంలో వివిధ సర్వే నంబర్లకు సంబంధించి నోటిఫికేషన్‌లో చూపిన 71.57 ఎకరాల భూములు మత, ధార్మిక, విద్యా ప్రయోజనాల కోసం దశాబ్ధాలుగా వక్ఫ్‌ ఆస్తులుగా ఉన్నాయన్నారు. వీటిని కౌలు ప్రాతిపదికన చాలా మంది రైతులు సాగు చేస్తున్నారన్నారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీ నిరుపేద విద్యార్థుల ప్రయోజనాలకు, మసీదులు, పాఠశాలల నిర్వహణకు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని వివరించారు. 1995 వక్ఫ్‌ చట్టం ప్రకారం వక్ఫ్‌ ఆస్తిని బదిలీ చేయడానికి వీలు లేదన్నారు. వివాదాస్పద నోటిఫికేషన్‌ జారీ చేయడానికి ముందు ముస్లిం సమాజానికి, వక్ఫ్‌ బోర్డుకు, అంజుమన్‌ సొసైటీకి, కౌలు రైతులకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, విచారణకు అవకాశం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత భూమిని సేకరించడం ద్వారా ముస్లిం సమాజానికి, ఈ భూముల నుంచి వచ్చే ఆదాయంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సమాజంలోని పేదలకు పూడ్చలేని సామూహిక నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి వక్ఫ్‌ భూముల సేకరణ చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని, నోటిఫికేషన్‌ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ వసీంసలీమ్‌, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్‌, మైనారిటీ విభాగం రాష్ట కార్యదర్శులు వేముల నదీమ్‌, రహంతుల్లా, అనంతపురం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ఫయాజ్‌, కార్పొరేటర్లు అబుసలేహ, ఇషాక్‌, షంషుద్ధీన్‌, మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు మన్సూర్‌, నాయకులు బాకే హబీబుల్లా, షేక్‌ జావీద్‌, ఖాజాపీరా, షరీఫ్‌ ఖాన్‌, రియాజ్‌, ఖాదర్‌బాషా, మహబూబ్‌బాషా, ఆసీఫ్‌, ఖమ్మర్‌ తాజ్‌, రపీ, షాహీ, ఇషాక్‌, షబ్బీర్‌, అబ్బాస్‌, ముక్తియార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement