కల్తీ నారు.. రైతు కన్నీరు
రైతులు నష్టపోతున్నారు
కళ్యాణదుర్గం ప్రాంతంలో విచ్చలవిడిగా నర్సరీలు వెలిశాయి. అందులో చాలా వాటికి అనుమతులు లేవు. పేరున్న కంపెనీ విత్తనాలు, నాణ్యమైన మొక్కలు అంటూ రైతులకు అంటగడుతున్నారు. చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే చివరకు పూత, పిందె రాకపోవడం, లేదంటే పురుగులు, తెగుళ్లు ఆశించి దిగుబడులు బాగా తగ్గిపోతున్నాయి. జరిగిన నష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారు లేరు.
– నవీన్, రైతు, పీఆర్‌టీ పల్లి, కళ్యాణదుర్గం
అనంతపురం అగ్రికల్చర్: కల్తీ విత్తనం, నాసిరకం నార్లు రైతులను చిత్తు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో కొందరు నర్సరీ నిర్వాహకులు వాటిని అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 450కు పైగా వెలసిన ఉద్యాన నర్సరీల ద్వారా వైరస్ ఉన్న పండ్ల మొక్కలు, నాసిరకం కూరగాయల పంటల నార్లు రైతులకు ఇస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి మొక్కలు నాటుకున్నందున పంట కాలంలో చీడపీడల బెడద ఎక్కువై పెట్టుబడుల ఖర్చు భారీగా పెరిగిపోతోందని, దిగుబడులపైనా ప్రభావం చూపుతోందని రైతులు వాపోతున్నారు.
పెరుగుతున్న సాగు... నర్సరీలకు డిమాండ్..
వేరుశనగ, ఇతర వ్యవసాయ పంటల సాగును తగ్గించిన రైతులు.. అంతో ఇంతో నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఇటీవల కాలంలో పండ్లు, పూలు, కూరగాయల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. గతంలో మాదిరిగా స్వంత విత్తనంతో నారుపెంపకం చేపట్టే పరిస్థితి లేదు. అధిక దిగుబడులు అంటూ హైబ్రీడ్ రకాలపై దృష్టి పెడుతున్నారు. దీంతో పండ్లు, కూరగాయల పంటలు సాగు చేయాలంటే చాలా వరకు నర్సరీలపై ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. చాలామంది నర్సరీ నిర్వాహకులు నిబంధనలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా నార్లు పెంచుతూ రైతులకు అంటగడుతున్నారు. ప్రధానంగా చీనీ, అరటి, ఇతర పండ్ల మొక్కలు, అలాగే మిరప, టమాట, వంగ, బెండ లాంటి కూరగాయల మొక్కలకు డిమాండ్ పెరుగుతోంది. ఏటా ఖరీఫ్, రబీలో 40 వేల ఎకరాల్లో టమాట, మిరప 10 నుంచి 15 వేల ఎకరాలు... ఇలా కూరగాయల పంటల విస్తీర్ణం పెరుగుతోంది. ప్రధానంగా కళ్యాణదుర్గం, శింగనమల, రాప్తాడు, అనంతపురం పరిధిలో నర్సరీలు భారీగా వెలిశాయి.
నర్సరీ యాక్ట్ అమలులో నిర్లక్ష్యం..
నర్సరీ యాక్ట్ అమలులో ఉన్నట్లు చెబుతున్నా... వాటి అనుమతులు, రిజిష్ట్రేషన్లు, పర్యవేక్షణపై ఉద్యానశాఖ దృష్టి సారించినట్లు లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రమం తప్పకుండా లైసెన్సులు రెన్యూవల్స్ చేసుకోవడం లేదని చెబుతున్నారు. మూడు నెలలకోసారి ఉద్యానశాఖ తనిఖీలు కూడా చేయాల్సి ఉంటుంది. కూరగాయల నర్సరీల్లో మదర్‌బ్లాక్ తప్పనిసరిగా ఉండాల్సి ఉన్నా ఎక్కడా పాటించడం లేదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో అక్కడక్కడా కూరగాయల మొక్కలు నాటుకుని దిగుబడులు లేక, చీడపీడల బెడదతో భారీగా నష్టపోయినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో చాలా వరకు కూరగాయల నర్సరీల్లో కల్తీ విత్తనాల నుంచి పెంచిన నాసిరకం నారు పెంచుతున్నట్లు ఆ శాఖ వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో గత నెలలో జిల్లాకు వచ్చిన శాస్త్రవేత్తల బృందం చీనీ తోటల్లో అధ్యయనం చేస్తూ... చీనీ నర్సరీ క్షేత్రాల నుంచి మొక్కలను తిరుపతిలో ఉన్న చీనీ, నిమ్మ పరిశోధనా కేంద్రానికి జిల్లా నుంచి 50 వరకు నమూనాలు (శ్యాంపిల్స్) పంపించారు. అందులో 20 వరకు నమూనాల్లో చిన్న మొక్కల్లోనై వైరస్ ఉన్నట్లు తేల్చారు. నాసిరకం, కల్తీ నార్లు కారణంగా ఉద్యాన పంటల్లో చీడపీడల బెడద, వైరస్ వ్యాప్తి బాగా పెరగడంతో చీనీ, అరటి లాంటి తోటల మనుగడ మున్ముందు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల బృందం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఉద్యానశాఖ ఉలిక్కిపడి.. నర్సరీల్లో కల్తీ నియంత్రణపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఫెయిలైన చీనీ నర్సరీ క్షేత్రాలకు మెమోలు జారీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న
ఉద్యాన నర్సరీలు
ఇటీవల చీనీ నర్సరీల్లో సేకరించిన శ్యాంపిల్స్ చాలా వరకు ఫెయిల్
టమాట, మిరపలో కల్తీనారు వల్ల తెగుళ్ల బెడదతో రైతులకు భారీ నష్టం
వైరస్ వ్యాప్తితో చీనీ, అరటి తోటల మనుగడపై శాస్త్రవేత్తల ఆందోళన
కల్తీ నారు.. రైతు కన్నీరు
కల్తీ నారు.. రైతు కన్నీరు


