నికర జలాల కోసం ఉద్యమించాలి
అనంతపురం: రాయలసీమ నుంచి కరువును పారదోలడానికి నికర జలాల కోసం ఉద్యమించాలని మాజీ మంత్రి, రాయలసీమ జన సంఘం (రాజసం) అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి అనంతపురం జిల్లా సాగునీటి పోరాట సమితి ఆధ్వర్యంలో ‘నీళ్లు! నీళ్లు!! నీళ్లు!!!’ పేరిట చేపడుతున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం అనంతపురంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో సాగునీటి కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. హంద్రీ–నీవా, జీఎన్‌ఎస్‌ఎస్, వెలిగొండ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించడంతో పాటు జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్లే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రాయలసీమ జల ఉద్యమానికి రైతులు, కూలీలు, మహిళలు, యువత, రచయితలు, కవులు, కళాకారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ‘100 టీఎంసీల’ రామాంజినేయులు మాట్లాడుతూ.. బుక్కపట్నం లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టాలన్నారు. కృష్ణా నది నుంచి ఏటా సగటున 453 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ జన సంఘం (రాజసం)లోకి అనంతపురం జిల్లా సాగునీటి పోరాట సమితిని విలీనం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. నీళ్లు వస్తేనే అన్ని సమస్యలకూ పరిష్కారం లభిస్తుందన్నారు.
రాయలసీమ జన సంఘం అధ్యక్షుడు శైలజానాథ్


