నరిగమ్మ ఆలయ తరలింపులో ఉద్రిక్తత
రాప్తాడు రూరల్: రోడ్డు విస్తరణలో భాగంగా అనంతపురం రూరల్ మండలం పాపంపేట శివారున కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న మైసూరు నరిగమ్మ ఆలయ తరలింపు ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, పెద్ద సంఖ్యలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు రంగంలోకి దిగారు. గ్రామదేవత ఆగమ శాస్త్రం మేరకు క్రతువు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ సమక్షంలోనే అమ్మవారి విగ్రహాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఆలయ తరలింపును అడ్డుకున్నారు. ఎంతో చరిత్ర కలిగిన అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలిగించకూడదని పట్టుబట్టారు. ఆలయ కమిటీ ఆమోదం మేరకే అమ్మవారి విగ్రహాన్ని కొత్త ఆలయంలోకి తరలిస్తున్నట్లుగా తహసీల్దారు మోహన్‌కుమార్, సీఐ శేఖర్, ఎస్‌ఐ రాంబాబు నచ్చచెప్పినా వినలేదు. సమాచారం అందుకున్న ఆర్డీఓ కేశవనాయుడు అక్కడికి చేరుకుని దగ్గరుండి మధ్యాహ్నం 1గంట సమయంలో విగ్రహాన్ని అక్కడి నుంచి నూతన ఆలయంలోకి తరలించారు.
పెద్ద ఎత్తున చేరుకున్న ట్రాన్స్‌జెండర్లు..
విగ్రహం తరలించిన తర్వాత కట్టడాన్ని తొలగించే పనులు చేపడుతుండగా సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో ట్రాన్స్‌జెండర్లు అక్కడకు చేరుకుని పనులను అడ్డుకున్నారు. అమ్మవారి ఆలయం ఎదుట హంగామా చేశారు. కేకలు వేస్తూ రెవెన్యూ, పోలీసు అధికారులపై తిరగబడ్డారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆలయ కమిటీ ఆమోదంతో విగ్రహాన్ని నూతన ఆలయంలోకి తరలించామని అధికారులు చెప్పినా వినలేదు. గుంపుగా నూతన ఆలయం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో అమ్మవారి విగ్రహం, కలశాన్ని తీసుకువచ్చి పాత ఆలయంలో ఉంచారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీఓ కేశవనాయుడు మరోమారు అక్కడికి చేరుకుని ట్రాన్స్‌జెండర్లతో సుదీర్ఘంగా చర్చించినా వారు ఒప్పుకోలేదు. విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ కేశవనాయుడు స్పష్టం చేశారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు..
నరిగమ్మ దేవాలయం తరలింపు వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించకూడదని వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధికార ప్రతినిధి మఠం శ్యాంసుందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానికుల సమ్మతితో సంప్రదాయ రీతిన ప్రత్యామ్నాయ స్థలంలో ఆలయ పునఃప్రతిష్ఠ జరగాలన్నారు. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలన్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా
విగ్రహం తరలించిన అధికారులు
నాలుగు గంటల సమయంలో
విగ్రహాన్ని తీసుకొచ్చి పాత ఆలయంలోనే
పెట్టిన ట్రాన్స్‌జెండర్లు
నరిగమ్మ ఆలయ తరలింపులో ఉద్రిక్తత


