ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించాలి
అనంతపురం సెంట్రల్: బొమ్మనహాళ్ మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నికను ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ముఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, ఉరవకొండ, కళ్యాణదుర్గం సమన్వకర్తలు వై.విశ్వేశ్వరరెడ్డి, తలారి రంగయ్య, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో డీఎస్పీ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ఉప ఎన్నికలూ అప్రజాస్వామికంగా జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం నాటి బొమ్మనహాళ్ ఎంపీపీ ఉప ఎన్నిక కూడా ఏకపక్షంగా జరిపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. అందులో భాగంగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఎన్నికలకు సంబంధించిన పత్రాలను ఎంపీడీఓకు అందజేసి, బయటకు వస్తుండగా కొంతమంది టీడీపీ నాయకులు దాడికి యత్నించారని, వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు లేరని వివరించారు. దీన్నిబట్టి చూస్తే ఉప ఎన్నిక ఏ విధంగా ఉంటుందో అర్థంచేసుకోవచ్చన్నారు. ఎంపీటీసీ సభ్యులందరూ స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే విధంగా పోలీసులు బందోబస్తు కల్పించాలని కోరారు. అప్రజాస్వామిక పద్ధతిలోనైనా ఎంపీపీ పీఠాన్ని కై వసం చేసుకోవాలని యత్నించడం సిగ్గుచేటన్నారు. మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ తన 21 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే తనపైన, కార్యకర్తలపైన టీడీపీ గూండాలు దాడి చేసినా, ఎంపీటీసీ సభ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తూ, దూషణలకు దిగుతున్నా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. 16 మందిలో 11 మంది ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారన్నారు. అయినా సరే ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎస్పీ స్పందించి తమ సభ్యులకు తగిన భద్రత కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ మెట్టు గోవిందరెడ్డిపై జరిగిన దాడి బాధాకరమన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని గూండాయిజం చేసి ఎంపీపీ ఎన్నిక జరపాలనుకోవడం సరికాదన్నారు. ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతితో పోలీసు భద్రత నడుమ ఎన్నిక జరపాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడికి పాల్పడుతున్న టీడీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ ప్రజాసామ్యంపై విశ్వాసం ఉంటే ఎంపీపీ ఎన్నిక సజావుగా జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నేత ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేలా
రక్షణ కల్పించాలి
జిల్లా కేంద్రం నుంచి
భద్రతను ఏర్పాటు చేయాలి
‘మెట్టు’పై దాడికి యత్నించిన వారిని
కఠినంగా శిక్షించాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
అనంత, ముఖ్య నేతల డిమాండ్


