పదవి కోసం పచ్చకుట్ర
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అధికారం కోసం టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. ప్రశాంతతకు నిలయంగా ఉన్న రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలంలో అరాచకపర్వానికి తెరతీశారు. అవకాశం లేకున్నా అడ్డదారిలోనైనా మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానం కై వసం చేసుకునేందుకు దూషణలు, దాడులు, దౌర్జన్యాలతో గూండాగిరి చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. బొమ్మనహాళ్ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గత ప్రాదేశిక ఎన్నికల్లో 15 వైఎస్సార్‌సీపీ, 1 స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. టీడీపీ ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టింది. రాజకీయ సమీకరణల్లో భాగంగా ఎంపీపీ పదవికి పద్మావతి రాజీనామా చేశారు. దీంతో ఈ నెల 5న ఎన్నిక అనివార్యమైంది. తగినంత సంఖ్యా బలం లేకున్నా టీడీపీ పోటీలో నిలిచి, అడ్డదారిలో కుర్చీ లాక్కునే కుట్రకు తెరతీసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు డబ్బు ఆశ చూపడం.. మాట వినకపోతే కేసుల పేరుతో టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగడం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పిన వైఎస్సార్‌సీపీ బీసీ సామాజికవర్గ ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ‘పార్టీ లేదు.. బొక్కా లేదు.. అడ్డొస్తే వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డినే కొట్టాం.. మీరెంత’ అంటూ విరుచుకుపడుతున్నారు. అరాచక పర్వాలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయినా.. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. దాడులు, బెదిరింపులకు పాల్పడిన టీడీపీ వారిపై కేసుల నమోదు చేసేందుకు వెనకంజ వేస్తున్నారు.
బొమ్మనహాళ్‌లో
టీడీపీ నాయకుల దాష్టీకం
కోరం లేకున్నా ఎంపీపీ కుర్చీ
లాక్కునే కుట్ర
ఏకంగా మాజీ ఎమ్మెల్యే
మెట్టుపైనే దాడులు
దాడులు చేసిన వారిపై
కేసుల నమోదుకు పోలీసుల వెనకంజ
నేడు బొమ్మనహాళ్
ఎంపీపీ స్థానానికి ఎన్నిక


