టీడీపీలో ఫ్లెక్సీల వార్‌ | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఫ్లెక్సీల వార్‌

Jan 1 2026 11:18 AM | Updated on Jan 1 2026 11:18 AM

టీడీపీలో ఫ్లెక్సీల వార్‌

టీడీపీలో ఫ్లెక్సీల వార్‌

అనంతపురం క్రైం: అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది. తనవి తప్ప ఇంకెవ్వరి ఫ్లెక్సీలూ కనిపించరాదనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతో పాటు స్వపక్షంలోని ఇతర టీడీపీ నేతలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా తట్టుకోలేకపోతున్నారు. తనవి మాత్రమే కనిపించాలన్నట్టు నియంతృత్వ పోకడకు పోతున్నారు. తాజాగా రామనగర్‌లో చోటు చేసుకున్న ఫ్లెక్సీ చించివేత ఘటన రాజకీయంగా దుమారం రేపింది. అంతేకాదు అధికార టీడీపీలో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి అభిమాని నటేష్‌చౌదరి ఫ్లెక్సీ వేయించి.. రామనగర్‌ 80 అడుగుల రోడ్డులో ఏర్పాటు చేయిస్తుండగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ వర్గీయులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీలను చించేశారు. నటేష్‌చౌదరిని అంతం చేస్తామంటూ బెదిరింపులకు సైతం దిగారు. ‘ఇది మా అడ్డా. ఇక్కడ ఎవ్వరూ ఫ్లెక్సీలు వేయకూడదు’ అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి చేయిదాటుతుండటంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, ఆయన అనుచర వర్గం రంగంలోకి దిగింది. అయితే దగ్గుపాటి వర్గీయులు కూడా వెనక్కు తగ్గలేదు. బాహాబాహీకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చౌదరికి నచ్చజెప్పి పంపించేశారు. కాగా నటేష్‌ చౌదరి మాత్రం ఫ్లెక్సీ వేసి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ‘పార్టీకి మేము పని చేయలేదా? మా ఫ్లెక్సీలు వేసుకోకూడదా?’ అంటూ పోలీసులను నిలదీశారు. అనంతరం ఇరువర్గాల వారికీ సర్దిచెప్పారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి రామనగర్‌కు చేరుకుని తన వర్గీయులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎవ్వరి ఫ్లెక్సీలూ వేయించవద్దని చెప్పి.. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే దగ్గరుండి చించివేయించి వెళ్లిపోయారని నటేష్‌చౌదరి ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆ సామాజిక వర్గ పెద్దలు స్పందించారు. సమస్యను సద్దుమణిగించేందుకు ‘వైకుంఠం’ నివాసంలో చర్చలు జరిపారు. అయితే తనను టార్గెట్‌ చేసుకుని, కుటుంబ సభ్యుల జోలికి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని ప్రభాకర్‌చౌదరి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

నటేష్‌ చౌదరి ఫ్లెక్సీలను చించేసిన దగ్గుపాటి వర్గీయులు

తమ అడ్డాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదంటూ హుకుం

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వర్గీయులకు ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయుల బెదిరింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement