వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలపై అక్కసు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘ఎవరు.. ఆ ఫ్లెక్సీలను అక్కడ ఉంచింది? నేను కార్యక్రమం వెళ్లి వచ్చేలోగా తొలగించాలి’ అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆదేశించడంతో ఆయన అనుచరులు.. వైఎస్సార్‌సీపీ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన ఘటన బుధవారం అనంతపురం శివారు రుద్రంపేట పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రబాబు కొట్టాలుకు వెళ్లేదారిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఎంపీటీసీ సభ్యురాలు మహబూబ్‌బీ, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంఎస్‌ఎస్ సాదిక్ ఏర్పాటు చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి వాటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తొలగించాలనే ఆదేశాలతో అనుచరులు, టీడీపీ కార్యకర్తలు వెంటనే ఫ్రేమ్‌లు విరగ్గొట్టి, ఫ్లెక్సీలను పీకేశారని సాదిక్ వలి వాపోయారు. ఫ్లెక్సీలు చించినంత మాత్రాన వారికి ఒరిగేదేమీ లేదని, ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు.


