యువకుడి ఆత్మహత్య
పెద్దపప్పూరు: మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన మల్లేష్ కుమారుడు అర్జున్ (24) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. శనివారం అర్ధరాత్రి విషపూరిత ద్రావకం తాగి అస్వస్థతకు గురి కావడంతో గమనించిన కుటుంబసభ్యులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సకు స్పందించక ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
యువతి బలవన్మరణం
కళ్యాణదుర్గం రూరల్: క్షణికావేశంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు... పాలవాయి గ్రామానికి చెందిన ప్రసాద్, శివమ్మ దంపతులు బతుకు తెరువు కోసం కొన్నేళ్ల క్రితం అనంతపురానికి వలస వెళ్లి కురుగుంటలో స్థిరపడ్డారు. శనివారం చిన్నపాటి అంశానికి తల్లి మందలించడంతో క్షణికావేశానికి లోనైన వీరి కుమార్తె శ్రావణి (17) పురుగుల మందు తాగింది. అపస్మారకంగా పడి ఉన్న కుమార్తెను కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం శ్రావణి మృతి చెందింది. ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు కళ్యాణదుర్గం పోలీసులు తెలిపారు.
నీటికుంటలో పడి
బాలుడి మృతి
పెద్దవడుగూరు: ప్రమాదవశాత్తు నీటి కుంటలోపడి ఓ బాలుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం రావులుడికి గ్రామానికి చెందిన సోమశేఖరరెడ్డి, సువర్ణ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాయలచెరువులోని సీవీ రమణారెడ్డి పాఠశాలో చదువుకుంటున్న పిల్లలు ఆదివారం సెలవు కావడంతో తల్లిదండ్రులతో కలసి పొలానికి వెళ్లారు. కాసేపటి తర్వాత కుమారుడు కమలేశ్వరరెడ్డి (9) ఒంటరిగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఉన్న కుంట వద్దకెళ్లి నీటిని చూస్తూ అదుపు తప్పి అందులో పడిపోయాడు. ఈత రాక నీటి మునిగి మృతిచెందాడు. చాలా సేపటి తర్వాత అటుగా వచ్చిన గొర్రెల కాపర్లు.. కుంటలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి, సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని వెలికి తీశారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బాలుడి మృతదేహం పడి కన్నీరుమున్నీరుగా విలపించారు.
రేషన్ బియ్యం స్వాధీనం
పుట్లూరు: మండలంలోని నారాయణరెడ్డిపల్లి క్రాస్ వద్ద ఆదివారం అక్రమంగా తరలిస్తున్న 26 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సత్యబాబు తెలిపారు. నార్పల మండలానికి చెందిన డ్రైవర్ మహేంద్ర వారం రోజులుగా ఆ మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరతో పేదలనుంచి కొనుగోలు చేసి, శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు బొలెరోలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వాహనాన్ని సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
యువకుడి ఆత్మహత్య


