మూల్యం చెల్లించక తప్పదు
● కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన వామపక్ష పార్టీల నాయకులు
అనంతపురం అర్బన్: ప్రజా వ్యతిరేక పాలనకు మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సీపీఐ, సీపీఐ (ఎంఎల్ – న్యూడెమోక్రసీ), ఎస్‌ఈయూసీఐ, సీపీఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్ –లిబరేషన్) జిల్లా కార్యదర్శులు పాళ్యం నారాయణస్వామి, ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, రాఘవేంద్ర, చంద్రశేఖర్, వేమన, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నాగేంద్రకుమార్ మాట్లాడారు. మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టానికి ఏటా నిధులు తగ్గిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేశారన్నారు. తాజాగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కొత్త బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించడం సిగ్గుచేటన్నారు. నూతన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కేశవరెడ్డి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, చిరంజీవి, కుళ్లాయిస్వామి, కృష్ణుడు, మంజూనాథ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.


