క్రీడా స్ఫూర్తిని చాటాలి
● జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం: గెలుపు ఓటమిని సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రాంతీయ స్థాయి పాలిటెక్నిక్ కళాశాల క్రీడోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించి, మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 16 కళాశాలల నుంచి మొత్తం 419 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి.జయచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ రామకృష్ణారెడ్డి, మెకానికల్ విభాగాధిపతి యుగంధర్, సివిల్ విభాగాధిపతి వీరేంద్ర బాబు, ఆటోమొబైల్ విభాగాధిపతి చంద్రశేఖర్‌రెడ్డి, ఈసీఈ విభాగాధిపతి ఓబులేసు, జనరల్ హెడ్ శ్రీనివాసులు, పీఆర్వో కరుణ కుమార్ పాల్గొన్నారు.
పెన్నహోబిలం హుండీ లెక్కింపు
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సోమవారం ఆలయ ఇన్‌చార్జ్ ఏసీ తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 107 రోజులకు గాను శాశ్వత హుండీల ద్వారా నగదు రూపంలో రూ.23.81 లక్షల ఆదాయం సమకూరింది. కానుకల రూపంలో 9.5 గ్రాముల బంగారం, 256 గ్రాముల వెండి వచ్చింది. కార్యక్రమంలో అనంతపురం, బళ్లారికి చెందిన బాలాజీ సేవా సమితి, గుంతకల్లు హనుమాన్ సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


