వేతన సవరణ చేసేదాకా పోరాడతాం
● డీసీసీబీ ఎదుట ఉమ్మడి జిల్లా పీఏసీఎస్ ఉద్యోగుల ధర్నా
● మద్దతు ప్రకటించిన డీసీసీబీ చైర్మన్, టీడీపీ నేతలు
అనంతపురం అగ్రికల్చర్: హెచ్‌ఆర్ పాలసీ అమలు, వేతన సవరణ తదితర డిమాండ్లు నెరవేరే వరకూ పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల యూనియన్ నాయకులు హెచ్చరించారు. ప్రధాన సమస్యలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై డీసీసీబీ ఉమ్మడి జిల్లా ఉద్యోగులు సోమవారం అనంతపురంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. డీసీసీబీ చైర్‌పర్సన్ ముంటిమడుగు కేశవరెడ్డి, శింగనమల టీడీపీ ముఖ్య నాయకులు ఆలం నరసానాయుడు, రామలింగారెడ్డి తదితరులు మద్దతు ప్రకటించి, దీక్షా శిబిరంలో కాసేపు కూర్చొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఏసీఎస్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా... చైర్మన్, ఇతర టీడీపీ నేతలు వారించకుండా పరోక్షంగా మద్ధతు ఇచ్చినట్లు సంకేతాలు ఇవ్వడం విశేషం. అనంతరం చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డికి వినతి పత్రం ఇవ్వగా... ప్రభుత్వం, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు సీపీఐ రాష్ట్ర నాయకుడు ఓబుళు, సీఐటీయూ నాగేంద్రకుమార్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి మద్ధతు ప్రకటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.శ్రీనివాసులు, డి.శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు, హరికృష్ణ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ యూనియన్ ఉమ్మడి జిల్లా నాయకులు పి.హనుమంతరెడ్డి, ఎం.హనుమంతరెడ్డి, ప్రతాపరెడ్డి, దామోదర్, డి.నారాయణ, నగేష్, రామాంజనేయులు, నరేంద్రరెడ్డి, కేసీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న విజయవాడ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా ఉంటుందని నాయకులు ప్రకటించారు.


