శిశుగృహ పోస్టుల భర్తీకి రేపు ఇంటర్వ్యూలు
అనంతపురం సిటీ: స్థానిక బుడ్డప్పనగర్‌లోని శిశుగృహలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం కింద ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ జిల్లా కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. శిశుగృహలో ఓ చిన్నారి ఆకలిచావుకు గురి కాగా, అందుకు కారణమైన అక్కడి ఎనిమిది ఉద్యోగులను కలెక్టర్ ఆనంద్ శాశ్వతంగా విధుల నుంచి తొలగించిన విషయం విదితమే. మేనేజర్, సోషల్ వర్కర్, ఆయా పోస్టుల భర్తీకి ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కాగా, అర్హత, ఆసక్తి ఉన్న పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 24న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మేనేజర్, సోషల్ వర్కర్ పోస్టుకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నర్సు, చౌకీదార్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి.
నైపుణ్యాల మెరుగుతోనే వృత్తిలో రాణింపు
బుక్కరాయసముద్రం: నైపుణ్యాలు మెరుగు పరుచుకున్నప్పుడే పోలీసు వృత్తిలో రాణించగలుగుతారని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని ఏపీఎస్పీ 14 బెటాలియన్‌కు నూతనంగా ఎంపికై న కానిస్టేబుళ్లకు ఎస్పీ జగదీష్ సూచించారు. సోమవారం బీకేఎస్ మండలం జంతలూరు వద్ద ఉన్న ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ప్రభుకుమార్, అడిషనల్ కమాండెంట్ కేశవరెడ్డి, డీఎస్పీ శివారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్‌బాషా, ఎస్‌సీటీపీసీఎస్ పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
పొడరాళ్లలో టీడీపీ నేతల దౌర్జన్యం
బుక్కరాయసముద్రం: మండలంలోని పొడరాళ్ల గ్రామంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంతో రస్తాను అడ్డుకున్నారు. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు సుబ్బరాయుడు, అతని కుమారులు సుబ్రహ్మణ్యం, లింగ, మరో ఇద్దరు కలసి పొలానికి వెళ్లే రస్తాలో ఎవరూ సంచరించకుండా అడ్డుకున్నారు. ఆ రస్తాలో 50 మంది రైతులకు చెందిన పొలాలు ఉన్నాయి. రస్తాను అడ్డుకోవడంతో పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు నాగభూషణ సర్దిచెప్పబోతుండగా ఘర్షణకు దిగి నాగభూషణ కుమార్తె మెడలోని బంగారు నగను లాగి పడేశారు. దీంతో బాఽధిత నాగభూషణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.


