సహజ వనరులు కొల్లగొడితే ఊరుకోం
● ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు సాగిస్తాం
● మాజీ మంత్రి శైలజానాథ్
బుక్కరాయసముద్రం: సహజ వనరులను కొల్లగొడితే చూస్తూ ఊరుకోబోమని, వాటి పరిరక్షణకు ఎందాకై నా పోరాటం సాగిస్తామని వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ పేర్కొన్నారు. సోమవారం బీకేఎస్‌లోని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా నశించి, ప్రజల జీవన ప్రమాణాలూ అడుగంటి పోయాయన్నారు. ఎటు చూసినా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై, వారి ఆస్తులపై దాడులు పెరిగి పోయాయని, ఇది మంచి పద్దతి కాదన్నారు. పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు సాగిస్తే రాజకీయం అని పేర్కొనడం సిగ్గు చేటన్నారు. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ దుర్మార్గాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. పుట్లూరు మండలంలో రైతు నాగలింగ మృతిపై ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోవడం బాధాకరమన్నారు. ఆ రోజు హడావుడిగా నాగలింగ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరించిన వారు ఆ బాధిత కుటుంబానికి ఎందు సాయం అందించలేకపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. నార్పలలో నిర్వహించిన రక్తదాన శిభిరంను విజయవంతం చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంతరెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, సర్పంచ్ పార్వతి, శింగనమల, నార్పల మండలాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పూల ప్రసాద్, ఖాదర్‌వలి, నాయకులు పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి, నారాయణరెడ్డి, రవి, పవన్, పూల రవి, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


