సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలి
రాయదుర్గం టౌన్: ఎంపీపీ ఎన్నికలో సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలని టీడీపీ శ్రేణులకు రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి హితవు పలికారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల బొమ్మనహాళ్ మండలం ఎంపీపీ రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో ఇన్‌చార్జ్ ఎంపీపీగా నాగరత్నమ్మను కలెక్టర్ నియమించారని గుర్తు చేశారు. మొత్తం 16 మంది ఎంపీటీసీల్లో 12 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన వారు ఎలాంటి ప్రలోభాలకు గురికావడం లేదని, వారంతా ఐక్యంగానే ఉన్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు ప్రలోభాలకు గురవుతున్నారని, ఎంపీపీ పదవిని టీడీపీ కై వసం చేసుకుంటోందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలకు దిగడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సమష్టి నిర్ణయంతో 12 మందిలో ఒకరిని ఎంపీపీగా త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ అన్ని మండలాల్లో ప్రజల విశ్వాసం గెలుచుకుని వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు కూడా కాకుండానే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్‌లో ప్రజల నుంచి పాజిటివ్ అవుట్‌పుట్ రావడం లేదన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి మధ్య నెలకొన్న వివాదం కేవలం ఓ నాటకమని పేర్కొన్నారు. సమావేశంలో బొమ్మనహాళ్ మండల 12 మంది ఎంపీటీసీలతో పాటు వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రామాంజనేయులు, వైస్ ఎంపీపీ రమేష్, నాయకులు కొత్తూరు తిమ్మప్ప, దేవగిరి హనుమేష్, రామకృష్ణ, వంశీ, రమేష్, వెంకటేశులు, లింగదహాళ్ చిదానంద, కోటేశ్వర్‌రెడ్డి, సీనియర్ నాయకులు లోకేష్, ఎంసీహెచ్ రాజ్‌కుమార్, సర్పంచ్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గం వైఎస్సార్‌సీపీ
సమన్వయకర్త మెట్టు


